భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా చాలా గొప్పది. దానికి ఒక నిదర్శనమే గ్రామ పంచాయతీలు, ఆ పంచాయతీలను పాలించే సర్పంచులు... వారికి ఉండే 'పవర్'. మనం తరుచూ వింటాం చెక్ పవర్ అనే మాట. కానీ చట్టాల ప్రకారం అది ఎవరికి ఉంటుంది అనేది చాలామందికి ఉండే సందేహం.
మన దేశంలో ప్రధానమంత్రి మొదలు... ఎమ్మెల్యేల వరకు.. ఎవ్వరికీ ప్రత్యక్షంగా 'చెక్‌పవర్' ఉండదు. ప్రభుత్వం నుంచి వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినా... వాటిని నేరుగా వినియోగించే అవకాశం ఏ ప్రజాప్రతినిధికి ఉండదు.. ఒక్క సర్పంచికి తప్ప. అదే సర్పంచికి ఉండే పవర్. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కేవలం ఒక్క సర్పంచి మాత్రమే నిధులను చెక్ పవర్ ద్వారా విడుదల చేసి.. గ్రామాభివృద్ధికి, తన గ్రామ ప్రజల అవసరాలకు వినియోగించగలరు.
ఏయే నిధులు వస్తాయి..
దేశంలోని ప్రతీ పంచాయతీకీ వివిధ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో అమలు కోసం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇవే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి కూడా వస్తాయి. వీటితోపాటు గ్రామ పంచాయతీ స్వీయ ఆదాయం, నరేగా నిధులు కూడా గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉంటాయి. వీటిని గ్రామ అవసరాలకు వినియోగించే అధికారం నేరుగా సర్పంచికి ఉంటుంది.