తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామ రిజర్వాయర్ స్థలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం వివాదానికి దారి తీసింది. గత 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన గండిపల్లి ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. ఎలాంటి పనులు జరగకపోయినా భవిష్యత్‌లో తిరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
రిజర్వాయర్ పూర్తయితే ఈ పైప్‌లైన్ మునిగిపోతుంది. పైప్ లైన్‌కు ఏదైనా మరమ్మతులు చేయాల్సి వస్తే.. నీటిలో ఉన్న పైప్ లైన్‌కు మరమ్మతులు చేయడం కుదరదు. ఇదే విషయాన్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫోన్లో సర్పంచ్ భర్త దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన సర్పంచ్ భర్త.. యువకుడిని దుర్బాషలాడాడు. యువకుడిని దూషించిన సర్పంచ్ భర్త తీరు పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా వేస్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను ఆపించి.. రిజర్వాయర్ అవతలి నుంచి పైప్ లైన్‌ను వేయించాలని కోరుతున్నారు.