సర్పంచి... ఈ హోదాకున్న స్థాయి, స్థానం వేరు. సేవ చేయాలనే ఆలోచన ఉండాలే గానీ.. అపార అవకాశాలుంటాయి. విమర్శలు, ఆరోపణలూ ఎదుర్కొక తప్పదు. సర్పంచి పదవి పూలబాటేం కాదు. సవాళ్ల, సమస్యల బాటే. ఎన్నికలప్పుడు ఉన్న పరిస్థితి ఎన్నికయ్యాక, గెలిచాక ఉండదు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజల ప్రశ్నలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నిధులు, ఆదాయం వంటి విషయాలు ప్రజలకు అనవసరం... వారికి కావాల్సింది సమస్యలు పరిష్కారమే. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది.
పైనుంచి నిధులు రాకపోతే..
గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా... పంచాయతీకి వచ్చే ఆదాయం సరిపోదు. ప్రభుత్వాల నుంచి నిధులు అవసరం. ప్రస్తుతం ఉన్న 'ఆర్థిక' కష్టాల్లో ప్రభుత్వాలు పంచాయతీలకు చాలినన్ని నిధులు ఇచ్చే అవకాశం తక్కువే. అలాంటప్పుడు పల్లెలను అభివృద్ధి చేయడం కష్టం. పైన పరిస్థితి ఎలా ఉన్నా గ్రామాల్లో నిందలు మోయాల్సింది సర్పంచులే..! అధికార పార్టీ బలపర్చి గెలిచిన వారికి ఇది ఇంకా పెద్ద సమస్య. ప్రతిపక్ష పార్టీల మద్దతుతో గెలిచిన అభ్యర్థులైతే.. నెపం ప్రభుత్వంపై నెట్టేయొచ్చు..!
గత అనుభవాలెన్నో...
గతంలో సర్పంచి పదవి చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఎందరో ఉన్నారు. ఆస్తులు అమ్ముకున్నవారూ ఉన్నారు. పరువుకు పోయి పల్లెను ఎంతోకొంత అభివృద్ధి చేసిన నాయకులు ఉన్నారు. అయినా విమర్శలు ఎన్నో. గ్రామానికి ఏదో చేద్దామని అనుకొని.. సర్పంచిగా పోటీచేసి గెలిచి... అప్పులపాలైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సర్పంచి పదవి అలంకారప్రాయం కాదు. అలా అనుకొని పోటీచేస్తే.. తప్పులో కాలేసినట్టే..!