return: సంబరాల సంక్రాంతి ముగిసింది. ఆఖరిదైన కనుమ రోజునా.. పల్లె, పట్టణాల్లో సంబరాలు కనుల విందుగా సాగాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలోని రామలింగేశ్వర స్వామి మహా రథోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం.. మహా రథోత్సవం వేడుకగా సాగింది. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కడప జిల్లా రాయచోటిలో బసవన్నలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కాటమరాజు గుడి చెంతకు తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పండుగ సంబరాల్లో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలో... ముగ్గుల, ఆటల పోటీలు నిర్వహించారు. టంగుటూరు ఊరు చెరువులో శ్రీ రాములోరి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. చీరాల మండలంలోని దేవాంగపురిలో ముగ్గులు పోటీలు నిర్వహించి.. విజేతలకు చీరలు పంపిణీ చేశారు. కనుమ పండగను పురస్కరించుకుని నెల్లూరులో పార్వేట ఉత్సవం వేడుకగా జరిగింది. సకల దేవతలు కొలువుదీరే ఈ పార్వేట ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగరంలోని పలు ఆలయాల ఉత్సవమూర్తులు నవాబుపేట, కిసాన్‌నగర్ ప్రాంతాల్లో కొలువుదీరారు. కొవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే దేవాతామూర్తులను ప్రతిష్టించారు. అనంతరం తెప్పోత్సవం వైభవంగా సాగింది. వెంకటగిరిలోని కుమ్మరిగుంట పుష్కరణిలో సాయిబాబాకు తెప్పొత్సం చేశారు.