ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంక్రాంతి సంబరాలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సంక్రాంతి పండుగ ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా చేపట్టిన సంస్కృతిక కార్యక్రమాలు, జల్లికట్టు, ఎడ్ల బల ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Sankranthi celebrations in various districts of the state
సంక్రాంతి ఉత్సవంలో ఆకట్టుకున్న కార్యక్రమాలు, పోటీలు..

By

Published : Jan 17, 2021, 12:35 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా... సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బల ప్రదర్శన, జల్లికట్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని తాళ్వాయిపాడు గ్రామంలో శ్రీ వీర్లయ్య స్వామి, మహాలక్ష్మీ దేవి ఉత్సవాలను గ్రామస్థులు వైభవంగా నిర్వహించారు. పసుపు, కుంకుమతో దేవతామూర్తుల విగ్రహాలను తీర్చిదిద్ది.. తేరులపై ఊరేగించారు. రెండు కిలోమీటర్ల పొడవునా ఉండే వీధుల్లో ఉద్యోగాలు సాధించాలని యువతీయువకులు వీటిని భుజాలపై మోశారు. రోసనూరు, శిరసనంబేడు గ్రామాల్లో జరిగిన శ్రీద్దలయ్య స్వామి ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలోని నేదునూరు గ్రామంలో జరిగిన ప్రభల ఊరేగింపు కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. కొందరు రాళ్లు రువ్వుకోవడంతో.. అంబాజీపేట ఎస్సై జానీ బాషాతో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ గొడవకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన 23 మంది పై కేసు నమోదు చేసినట్లు అయినవెల్లి ఎస్సై నరసింహమూర్తి వెల్లడించారు. జగ్గన్నతోట ప్రభల తీర్థం ముగిసిన అనంతరం నేదునూరు గ్రామానికి ప్రభలను తీసుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల గంగుడిపల్లిలో జరిగిన పశువుల పండుగలో అపశృతి జరిగింది. జల్లికట్టులో పాల్గొన్న ఆవు మృతి చెందడంతో.. విషాదచాయలు అలుముకున్నాయి. ఆవు కొమ్ములకు ఉన్న చెక్కపలకను కొంతమంది యువకులు తీస్తుండగా.. ఎద్దు.. ఆవును ఢీకొట్టిన ఘటనలో.. గో మాత అక్కడికక్కడే మృతి చెందింది.

గుంటూరు జిల్లా దుర్గిలో ఎడ్ల బల ప్రదర్శనలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. పోటీలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి ఎడ్లను తీసుకొచ్చారు. వీటిని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుర్గిలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి తిరుణాల్లాను పురస్కరించుకుని.. ఏటా రాష్ట్ర స్థాయి ఈ ఎడ్ల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రైతులను ప్రోత్సహించేందుకు పందాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని రామకృష్ణా రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా... కనువిందుగా కనుమ వేడుక

ABOUT THE AUTHOR

...view details