SANKRANTHI CELEBRATIONS: హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు..! ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు..! వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలు..! అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో.. పట్టణాలు, పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడింది.
సంక్రాంతిని పురస్కరించుకుని... ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెంలో మూడోరోజు ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ఉత్సాహంగా జరిగింది. పోటీల్లో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. విశాఖ జిల్లా మునగపాకలో నిర్వహించిన ఎడ్లబండి పోటీలు ఆకట్టుకున్నాయి. తెలుగుదేశం నేత ప్రగడ నాగేశ్వరరావు పోటీలను ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా నెల్లూరు నగరంలో సమాదుల వద్ద పండగ చేయడం ఆనవాయితీ. చనిపోయిన వారికి ఇష్టమైన పదార్థాలను వండి నైవేద్యం పెడతారు. సమాదులను పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు. అర్ధరాత్రి వరకు పెద్దల పండుగను కోలాహలంగా చేశారు. కర్నూలులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు కాలనీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పెద్దఎత్తున మహిళలు పాల్గొని రంగవల్లులతో అలరించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.
సింహ వాహనంపై అమ్మవారు...
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సింహవాహనంపై శ్రీ గౌరీదేవిని ఊరేగించారు. ఆలయంలోని అలంకార మండపం నుంచి ప్రత్యేక అలంకరణలో... సింహ వాహనంపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు. ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామి, త్రిశూలం పల్లకిలో కైలాసాగిరి ప్రదక్షిణ చేశారు.