రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తగిన ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు ప్రస్తుతం ఇసుక అవసరమైనవారికి లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చుక్కలు చూపిస్తోంది. అన్ని జిల్లాల్లో నదుల్లోని ఓపెన్ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు దాదాపు నిలిపేశారు. నిత్యం అధికంగా ఇసుక తవ్వకాలు జరిగే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓపెన్ రీచ్‌లన్నీ మూతపడ్డాయి.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటి రెండు పట్టా భూముల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా కొంత తీస్తున్నారు. ఇసుక టెండరు దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు మే 1 నుంచి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కటాఫ్ తేదీ ప్రకటించగానే రీచ్‌లు, నిల్వ కేంద్రాలు, డిపోలు, వాటిలో ఇసుక నిల్వలను ఆ సంస్థకు అప్పగించాలని ఇప్పటికే గనులశాఖ అధికారులు ఆదేశించారు.
సగటున 30 వేల టన్నులలోపే..
నిత్యం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఎవరైనా ఇసుక బుక్‌చేసుకోవచ్చు. కొద్ది రోజుల కిందటి వరకు సగటున నిత్యం 80 వేల నుంచి లక్ష టన్నుల వరకు బుకింగ్‌లు ఉండేవి. కొద్ది రోజులుగా ఇవి 30 వేల టన్నులలోపే ఉంటున్నాయి. రీచ్‌లు అందుబాటులో లేకపోవడం, ఇసుక నిల్వలు కొన్నిచోట్లే ఉన్నట్లు చూపించడంతో ఎక్కువ మంది బుక్ చేసుకోవడం లేదు.
సర్వర్ వేగం కూడా తగ్గడంతో బుకింగ్‌లు త్వరగా జరగడం లేదని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించేనాటికి, ఏపీఎండీసీ పరిధిలో ఆన్‌లైన్‌లో బుక్ అయిన ఇసుకంతా సరఫరా జరిగి, పెండింగ్ లేకుండా చూసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనివల్ల ఇసుక అవసరమైన సామాన్యులకు ఇబ్బందులు తప్పట్లేదు.