భారీ యంత్రాంగం, అన్ని వ్యవస్థలూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, సరఫరా చేపడుతుంటేనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ బాధ్యతలను ప్రైవేటుపరం చేస్తే వాటిని నిలువరించటం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు నిర్మాణరంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. ప్రైవేటు సంస్థలతో ధరలు నియంత్రించగలరా అని అడుగుతున్నారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాల బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తీసుకోవడం కష్టమని చెబుతున్నారు. అలాగని రీచ్‌లను ప్రైవేటుకు అప్పగిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొత్త ఇసుక విధానంపై నిర్మాణరంగ నిపుణులు పలు సందేహాలు లేవనెత్తుతున్నారు.
ప్రైవేటు చేతికెళ్తే..
ఇసుక వ్యాపారంలోకి భారీ నిర్మాణసంస్థలే వస్తాయని, అలాంటి సంస్థలు లాభాపేక్షకే పెద్దపీట వేస్తాయన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్‌ఈబీని ఏర్పాటుచేసి కఠిన చర్యలు తీసుకున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు. మరి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తమిళనాడు అనుభవమే గుణపాఠం
2006లో తమిళనాడు ప్రభుత్వం ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టి చేతులు కాల్చుకుంది. వారు మీటరు మేర తవ్వేందుకు అనుమతి ఉన్న చోట.. ఐదు మీటర్ల మేర తవ్వేశారు. రూ.కోట్లలో డబ్బు సంపాదించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడగా, సామాన్యులకూ ఇసుక అందలేదు. దాంతో 2011లో అక్కడి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దుచేసింది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు.. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థల ద్వారానే ఇసుక తవ్వకాలు చేపడుతున్నాయి.