రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.375 చొప్పున ఏపీఎండీసీ ద్వారా అమ్ముతుండగా.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల ఇది మరింత భారం కానుంది. కేంద్ర సంస్థ ద్వారా విక్రయాలు చేపడితే టన్నుకు గరిష్ఠంగా మరో రూ.100 చొప్పున పెరగనుందని అంచనా. కొత్త ధర అమల్లోకి వస్తే 12 టన్నుల సామర్థ్యం ఉండే 6 టైర్ల లారీ ఇసుక ధర అదనంగా రూ.1,200, నాలుగున్నర టన్నుల ట్రాక్టర్‌కు రూ.450 చొప్పున పెరిగే ఆస్కారం ఉంది.
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలకు రెండు కేంద్ర సంస్థలు ముందుకు రాగా, వీటిలో ఓ సంస్థను ప్రభుత్వం త్వరలోనే ఎంపిక చేయనుంది. టన్ను ధర గరిష్ఠంగా రూ.475కి విక్రయించేలా నిబంధన రూపొందిస్తోంది. ఇది ప్రస్తుత ధర కంటే రూ.100 అదనం. రాష్ట్రంలో ఏటా సుమారు 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయం జరుగుతుంది. పెరిగే ధరల ప్రకారం లెక్కిస్తే ఏటా వినియోగదారులపై రూ.200 కోట్ల భారం పడనుంది.