సెప్టెంబరు 5 నుంచి.. కొత్త ఇసుక పాలసీ - సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త ఇసుక పాలసీ సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. తమకు చెడ్డపేరు తెచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని సీఎం అన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటా ఇసుక రీచ్‌లు పెంచాలని అధికారులకు సూచించారు.
సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. మార్కెట్‌లో ఉన్న రేటు కంటే తక్కువరేటుకే ఇసుక అందుబాటులోకి తేవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇసుక సరఫరా పెంచాలని... లేకపోతే రేట్లు తగ్గవని తెలిపారు. గుర్తించిన స్టాక్ యార్డుల్లో ఇప్పట్నుంచే ఇసుక నింపడం మొదలుపెట్టాలన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటా ఇసుక రీచ్‌లు పెంచాలని తెలిపారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని... ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలని అధికారులకు సీఎం తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో ఎవరూ తప్పు చేయకుండా చూడాలని సీఎం జగన్ అన్నారు. మనకు చెడ్డపేరు తెచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని జగన్ అధికారులతో అన్నారు.