ఇసుక కొరత, సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి స్థానికంగా ఉన్న నదులు, వాగుల్లోని రీచ్‌ల్లో తవ్వకాలు చేసి 20 కిలోమీటర్లలోపే రవాణా చేసేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామ సచివాలయాల పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరిపేలా ఆదేశాలు జారీ చేసింది.
సచివాలయంలో అధికారులతో ఇసుక కొరత, రవాణాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.. ఇసుక లభ్యత, డిమాండ్లపై ఆరా తీశారు. ప్రస్తుతం నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడం కారణంగా... ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు సీఎం వివరించారు. 55 రోజులుగా గోదావరి, 71 రోజులుగా కృష్ణా నది పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయని తెలిపారు. తుంగభద్రతో పాటు... వంశధార, పెన్నా నదుల్లోనూ వరద ప్రవాహం కొనసాగుతోందని చెప్పారు. ఇసుక లభ్యత ఉండే ప్రాంతాల్లో తవ్వకాలు చేయలేకపోతున్నామని... రీచ్‌ల వరకు వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 200 ఇసుక రీచ్‌ల్లో... ప్రస్తుతం 69 చోట్ల మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రోజుకు 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నట్లు వెల్లడించారు.
ఎక్కడ సాధ్యమో... అక్కడ ప్రయత్నించండి....
నదుల్లో ప్రవాహాలు తగ్గకుంటే.. ఎక్కడ సాధ్యం అవుతుందో ఆయా ప్రాంతాలను గుర్తించి... ఇసుకను వెలికి తీయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 3 నెలల కాలానికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని... గ్రామ సచివాలయం నుంచే పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాల్లో అవినీతి లేకుండా, పర్యావరణానికి నష్టం రాకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు.
పర్యవేక్షణ... గ్రామ వాలంటీర్లకు...
గ్రామ సచివాలయంలోనే చెల్లింపులు చేసి ఇసుకను పొందే అవకాశం కల్పిస్తూ... కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. గుర్తించిన రీచ్‌లలో తవ్వకాల పర్యవేక్షణను వాలంటీర్లకు అప్పగించేలా గ్రామ సచివాలయం నిర్ణయం తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. రవాణా చేస్తున్న వాహనాలు, తరలిస్తున్న పరిమాణంపైనా గ్రామవాలంటీర్లు రికార్డు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.