రీచ్‌ల నుంచి ఇసుక లోడింగ్‌లో జాప్యం.. కొనుగోలుదారులకు భారంగా మారింది. ఎన్ని రోజులు వేచి ఉంటే.. అన్ని రోజుల కిరాయిని లారీల యజమానులు వసూలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను చేపట్టిన జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ఇంకా పూర్తి స్థాయిలో రీచ్‌లను తెరవలేదు. కొన్ని తెరిచినా వాటిలో తవ్విన ఇసుకలో దాదాపు సగానికిపైగా వర్షాకాలపు అవసరాలకు ముందస్తు నిల్వల కోసం తరలిస్తున్నారు. మిగిలిన కొద్దిపాటి రీచ్‌లలోనే ప్రజలకు అవసరమైన ఇసుక సరఫరా చేస్తున్నారు.
రీచ్‌కు సమీపంలో ఉండే ప్రాంతాల లారీలకు రోజుకు రెండు, మూడుసార్లు ఇసుక లోడ్ చేస్తుండగా.. దూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలకు ఒక్క ట్రిప్ కూడా లోడ్ చేయడం లేదు. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లాలోని నడిపూడి, సిద్ధాంతం రీచ్‌లకు భీమవరం, పాలకొల్లు, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి వెళ్లిన లారీలు.. రెండు రోజులకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. కృష్ణా జిల్లాలోని మున్నలూరు, ఇసుకేపల్లి రీచ్‌లకు విజయవాడ, ఇబ్రహీంపట్నం, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే లారీలదీ ఇదే పరిస్థితి. వేచి ఉండే సమయానికి డ్రైవర్, క్లీనర్లకు అదనపు బత్తా ఇవ్వాల్సి వస్తోందంటూ.. కొనుగోలుదారుల నుంచి ప్రతి ట్రిప్‌లో రూ.3 వేల నుంచి రూ.4 వేలను అదనంగా తీసుకుంటున్నారు.
తూకపు యంత్రాలు ఏవి..?
రాష్ట్రంలోని అనేక రీచ్‌లలో తూకపు యంత్రాలు లేవు. ఏపీఎండీసీ నుంచి దాదాపు 115 తూకపు యంత్రాలను జేపీ సంస్థకు అప్పగించారు. వీటిలో చాలావరకు మూలన పడ్డాయి మరోవైపు జేపీ సంస్థ తూకపు యంత్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. చాలాచోట్ల లేవు. దీంతో లారీల్లో అంచనా మేరకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. అయితే దారిలో అధికారులు తనిఖీ చేసినప్పుడు అదనపు లోడ్ ఉందంటూ కేసులు పెడుతున్నారు.
లోడింగ్‌లో జాప్యం చేస్తున్నారు..
"రీచ్‌లలో సకాలంలో ఇసుక లోడింగ్ చేయట్లేదు. వందల్లో లారీలు ఆగిపోవాల్సి వస్తోంది. ప్రజలకు అవసరమైన ఇసుకను వేగంగా లోడింగ్ చేయకుండా, స్టాక్‌యార్డ్‌కు తరలించే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు."-ఎ.చిట్టిబాబు, ఇసుక లారీ యజమానుల సంఘం, విజయవాడ