ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాణ్యతలేని ఇసుకను వెనక్కు పంపొచ్చు... ప్రతిపాదన సిద్ధం చేస్తున్న ఏపీఎండీసీ

ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్నాక నాణ్యమైనది సరఫరా కాకపోతే, దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు. దాని స్థానంలో మళ్లీ నాణ్యమైన ఇసుక ఉచితంగా అందేలా చూడనున్నారు. ఈ మేరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రతిపాదన సిద్ధం చేస్తోంది.

By

Published : Jul 27, 2020, 11:16 AM IST

sand can be sent back if it is not in good quality says apmdc
నాణ్యతలేని ఇసుకను వెనక్కు పంపొచ్చు

ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్నాక నాణ్యమైనది సరఫరా కాకపోతే, దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు. దాని స్థానంలో మళ్లీ నాణ్యమైన ఇసుక ఉచితంగా అందేలా చూడనున్నారు. ఈ మేరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. ఇప్పటి దాకా ఇంటికి డెలివరీ చేసిన ఇసుక నాణ్యత లేకుండా, మట్టితో కలిసి ఉంటే, ఏం చేయాలో కొనుగోలుదారులకు అర్థం కావడం లేదు. అన్ని జిల్లాల్లో నిత్యం ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. పలు పట్టా భూముల్లో మట్టి సహా ఇసుకను తవ్వి నిల్వ కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. అది నిర్మాణానికి ఉపయోగపడట్లేదని ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటి నిర్మాణానికి నాసిరకం ఇసుక సరఫరా చేశారు. దీనిపై ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.

ఇసుక నిల్వలపై డ్రోన్‌తో సర్వే
రేవుల్లోంచి తవ్వితీసిన ఇసుక పరిమాణం, స్టాక్‌ పాయింట్లలోని నిల్వల లెక్క తేల్చేందుకు డ్రోన్లతో సర్వే చేయించాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు నిర్ణయించారు. కొద్ది నెలల కిందట జరిగిన ఇసుక తవ్వకాల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి అధికారుల బృందంతో ఆడిట్‌ చేయించారు. రికార్డులు, ఆన్‌లైన్‌ బుకింగ్‌ వివరాలు ఆధారంగా ఆయా రేవుల్లో ఎంత ఇసుక తీశారు? నిల్వ కేంద్రాల్లో ఉన్నదెంత? తదితర వివరాలు లెక్కించారు. ఈ ఆడిట్‌ నివేదికను ఏపీఎండీసీకి అందజేశారు. ఇందులో పేర్కొన్న లెక్కలు సరిపోతున్నాయా? లేదా? చూసేందుకు మరోసారి డ్రోన్‌ ద్వారా సర్వే చేయించాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు ఇప్పటికే ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. కొన్ని నిల్వ కేంద్రాల్లో వేల టన్నుల ఇసుక ఉండటంతో డ్రోన్‌ ద్వారా వాటిని అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. రీచ్‌ల్లోనూ ఇలాగే చేయించనున్నారు. ఆడిట్‌ నివేదిక వివరాలను, డ్రోన్‌ పరిశీలనలో తేలినవి సరిపోల్చి తుది అంచనాకు రానున్నారు.

గుత్తేదారులకు జరిమానాలు
తవ్వి తీసిన ఇసుకకు, నిల్వ కేంద్రాల్లో ఉన్న దానికి మధ్య 2.8 లక్షల టన్నుల వ్యత్యాసాన్ని గతంలోనే ఆడిట్‌లో గుర్తించినట్లు తెలిసింది. నిల్వ కేంద్రానికి తరలించే సమయంలో ఈ ఇసుక పక్కదారి పట్టినట్లు తేల్చారు. ఆయా రేవుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా చేసే గుత్తేదారులకు జరిమానా విధించి, బిల్లుల చెల్లింపుల్లో కోత పెట్టినట్లు సమాచారం. ఆడిట్‌ లెక్కలు తేలిన తర్వాత వ్యత్యాసం మరింత ఉంటే మిగిలిన గుత్తేదారులపైనా చర్యలు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

కోసుకుపోతున్న రక్షణ కవచం

ABOUT THE AUTHOR

...view details