ఏపీ రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఫ్‌ఎల్) తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలునివ్వాలని ఐఆర్‌టీఎస్ అధికారి కోగంటి సాంబశివరావు కోరారు. ఈ మేరకు ఆదివారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం సోమవారం విచారించనుంది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్‌టీఎస్) అధికారి సాంబశివరావు 2015 జనవరి28 నుంచి 2018 డిసెంబరు10 వరకు డిప్యుటేషన్‌పై ఏపీ ప్రభుత్వంలో పనిచేశారు. 2016 మార్చి4 వరకు ఏపీ మౌలిక వసతుల సంస్థ (ఇన్‌క్యాప్) వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తొలిదశ ఫైబర్‌నెట్ టెండర్లను టెరా సంస్థకు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలతో సాంబశివరావును రెండో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. శనివారం అరెస్టు చేసింది.
AP High Court: హైకోర్టులో ఐఆర్‌టీఎస్ అధికారి సాంబశివరావు అత్యవసర వ్యాజ్యం - ap high court latest hearing
12:01 September 19
మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు కేసు కొట్టివేయాలని పిటిషన్
బెయిల్ పిటిషన్‌లో ఏముందంటే..
‘తొలి దశ టెండర్ల బిడ్ దస్త్రాలను వివిధ కమిటీలు పరిశీలించాయి. బహిరంగ మార్కెట్ పద్ధతిలో బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించాయి. వివిధ స్థాయిల్లో కమిటీలు సామూహిక నిర్ణయాలు తీసుకున్నాయి. బిడ్డింగ్ విషయంలో ఇన్‌క్యాప్‌కు చెందిన ఏ ఒక్క అధికారీ బిడ్డర్లతో కుమ్మక్కయ్యారని చెప్పడానికి వీల్లేదు. టెండర్ల మదింపు విధానమంతా పారదర్శకమే. ఉన్నతస్థాయి టెండర్ అప్రూవల్ కమిటీ సిఫారసు మేరకు టెండరు ఖరారైంది. ఇన్‌క్యాప్ ఎండీగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించా. వేధించేందుకే నాపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ నివేదికలో నాపై పేర్కొన్న ఆరోపణలన్నీ నిరాధారం. టెండరు ప్రక్రియలో టెరాసాఫ్ట్‌వేర్ ప్రైవేటు లిమిటెడ్‌తో కుమ్మక్కయ్యాననే ఆరోపణ నిరాధారం. ఈ నేపథ్యంలో నాపై ఎఫ్‌ఐఆర్ నమోదు సరికాదు. దాన్ని కొట్టేయాలి. ప్రస్తుతం రైల్వే శాఖలో పనిచేస్తున్నందున ఈ కేసుకు సంబంధించిన రికార్డులు నావద్ద లేవు. ఇన్‌క్యాప్‌కు చెందిన సిబ్బంది, సాక్షులను ప్రభావితం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. శాఖాపరమైన విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఆరోపిత నేరం 2015లో జరిగినట్లు పేర్కొన్నారు. 2018 డిసెంబరు తర్వాత మాతృ సంస్థ రైల్వేశాఖకు వెళ్లా. 2019లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చింది. 2015లో చోటు చేసుకున్న ఘటన అంటూ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకే కేసు పెట్టినట్లు స్పష్టమవుతోంది. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే సీఐడీ పోలీసులు నేరుగా నాపై కేసు నమోదు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఇచ్చిన నోటీసును అనుసరించి ఈనెల 14, 17, 18 తేదీల్లో సీఐడీ ముందు హాజరయ్యా. వారు రోజుకు పది గంటలపాటు విచారించారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. 48గంటలకు మించి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటే నన్ను సస్పెండ్ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో తక్షణం బెయిలు మంజూరు చేయండి. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని విన్నవించారు.