నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. వెంకటేష్ పెట్టిన పోస్టును నువ్వే తయారుచేశావా రా? అంటూ ఎస్సై జయకృష్ణ, కానిస్టేబుల్ శ్రీనివాసులు మోకాళ్లపై కర్రలతో కొట్టారు. మళ్లీ లేపి గోడకుర్చీ వేయించారు. కాసేపు అటూఇటూ నడిపించారు. నా ల్యాప్‌టాప్ తెప్పించారు. పాస్‌వర్డ్ ఎంటర్ చేసి మెయిల్ ఓపెన్ చేయమన్నారు. కంగారులో చేయలేకపోయా. లక్ష్మణ్ అనే సీనియర్ పోలీసు అధికారి నా గుండెలపై గుద్దారు. నేను బాధతో గట్టిగా అరిచా. నాటకాలేస్తున్నావురా అంటూ దుర్భాషలాడారు..’ అని సీఐడీ పోలీసుల చేతిలో చిత్రహింసకు గురైన సామాజిక మాధ్యమ కార్యకర్త సాంబశివరావు వాపోయారు.
జగన్ విధానాలు నచ్చక వైకాపా గౌరవాధ్యక్ష పదవికి వై.ఎస్.విజయమ్మ రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన లేఖను పోస్టు చేశారన్న అభియోగంపై సీఐడీ పోలీసులు ధరణికోటకు చెందిన వెంకటేష్‌తోపాటు అరెస్టు చేసిన సాంబశివరావు.. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా అధినేత చంద్రబాబుతోపాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. విచారణ పేరుతో సీఐడీ పోలీసులు ఎలా చిత్రహింసలకు గురిచేశారో వివరించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లుకు చెందిన సాంబశివరావు తెదేపా సామాజిక మాధ్యమ విభాగంలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారు.