బతుకుదెరువుకోసం భర్తతో కలిసి చిన్న చితకా పనులు చేసుకుంటూ... భర్తకు చేదోడు వాదోడుగా ఉండడానికి ఊళ్లలో తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగించే సమతపై సామూహిక హత్యాచారం చేసి కిరాతకంగా అంతమొందించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సమతపై జరిగిక కిరాతకం తెలిసిన ఎవరికైనా కన్నీరు రాకతప్పదు. తన పిల్లలిద్దరినీ తల్లిదండ్రుల వద్ద ఉంచి పొట్టకూటి కోసం ఇంటింటికీ తిరుగుతూ చిన్నపిల్లల వస్తువులు, తలవెంట్రుకలకు స్టీలు సామాను అమ్ముకునేది. నిత్యం భర్తతో కలిసి వెళ్లి తలో ఊరు తిరుగుతూ అమ్మకాలు చేసుకుని సాయంత్రానికి ఇద్దరు కలిసి ఇంటికొచ్చేవారు. ఆ క్రమంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు నడిచి వెళ్తున్న సమయంలో ముగ్గురు కిరాతకులు దారుణంగా ఆమెను అంతమొందించారు.
ఒళ్లంతా నెత్తురు మయం... చేతులు విరిచేశారు... శరీరం కమిలిపోయింది... వంటి మీద దుస్తులు లేవు.. కత్తితో పీక కోశారు. వాళ్ల వికృత చేష్టలు తాళలేక జుట్టు పీక్కుంది.. గిజగిజ కొట్టుకుంది... తనను ప్రాణాలతో విడిచిపెట్టమని ఎంత ప్రాధేయపడిందో.... రక్త మయమైన దేహాన్ని కుక్కల్లా పీక్కుతింటున్న మృగాళ్ల బారి నుంచి కాపాడమని ఎంతలా రోధించిందో.. ఆ దేవుడికే తెలియాలి. మీ అక్కలాంటి దాన్ని... మీ అమ్మ గుర్తుకు రావడం లేదా... చిన్న పిల్లల తల్లిని... నా భర్తకు తెలిస్తే గుండె పగిలి పోతుంది.. నా అత్త.. నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు... కాస్త దయచూపండి అంటూ ఆమె పడిన వేదన అరణ్య రోదనే అయింది. బతికుంటే ఈ దుశ్చర్యను ఎక్కడ బయట పెడుతుందోనని క్రూరంగా చంపేశారు. ఎంత దారుణంగా అంటే... సమత మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన వారు కూడా కంటతడి పెట్టి ఉంటారు. ఎందుకంటే ఆమె పడిన చిత్రవధ అలాంటిది. ఈ ఘటన జరిగిన 66 రోజుల తర్వాత పలు దశల విచారణ అనంతరం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితులు ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది.