ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 3 లక్షల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల విక్రయం - private hospital news

రెమిడెసివిర్‌... రాష్ట్రంలో అధికంగా వినియోగిస్తున్న ఖరీదైన ఔషధం. కొవిడ్‌ బాధితులకు ప్రాణవాయువు అవసరమైన దశలో రెమిడెసివిర్‌, టోసిలిజుమాబ్‌ ఇంజెక్షన్లను వాడేందుకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చింది. దాంతో సుమారు మూడు నెలల నుంచి రెమిడెసివిర్‌ 2.25 లక్షల వరకు, టోసిలిజుమాబ్‌ 2,400 యూనిట్ల వరకు వాడారు. వీటికి అదనంగా ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లోనూ ఇప్పటివరకు 60వేల వరకు ఉపయోగించారు. బాధితులకు భారం కాకుండా వీటికయ్యే ఖర్చులన్నీ తామే భరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి విరుద్ధంగా... కొన్నిచోట్ల ప్రైవేటు ఆసుపత్రులవారు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న రోగులతోనే కొనుగోలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

sale-of-3-lakh-remediesivir-injections-in-the-state
రాష్ట్రంలో 3 లక్షల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల విక్రయం

By

Published : Sep 13, 2020, 9:04 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌ లక్షణాలు మధ్య, తీవ్ర దశల్లో ఉన్న బాధితులకు వైద్యుల సిఫార్సు మేరకు ఆరు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం ఐదు కంపెనీల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కంపెనీలను అనుసరించి ఒక్కోదాన్ని రూ.2,800 నుంచి రూ.5,400 మధ్య విక్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్నిచోట్ల వైరస్‌ బాధితులకు ఓ మోస్తరు లక్షణాలున్నా వీటిని వాడేస్తున్నారు. ఫలితంగా వాటి విక్రయాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కోదానికి రిటైల్‌గా సగటున రూ.4,000 చొప్పున వేసుకున్నా 2.25 లక్షల ఇంజెక్షన్ల మొత్తం విలువ సుమారు రూ.90 కోట్లు.

  • సైటోకైన్స్‌ పెరిగితే టోసిలిజుమాబ్‌

సైటోకైన్స్‌ అనూహ్యంగా పెరిగి, రోగి పరిస్థితి విషమంగా మారితే టోసిలిజుమాబ్‌ వాడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో, ప్రైవేటులో కలిపి 2,400 ఇంజెక్షన్లను వినియోగించారు. ఒక్కో ఇంజెక్షన్‌ ధర రూ.40 వేలు ఉంది. అంటే.. రూ.9.60 కోట్లు ఖర్చు చేశారు.

  • కొన్నిచోట్ల బాధితులతోనే కొనుగోళ్లు!

ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లోని బాధితులకు ప్రభుత్వం ఈ ఇంజెక్షన్లను ఉచితంగా అందుబాటులో ఉంచింది. నెట్‌వర్క్‌, ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రులు, జిల్లా అధికారుల నుంచి అనుమతి పొందిన ఆసుపత్రుల్లో రోగులకు దీన్ని ఇస్తే.. వాటి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు వివరాలు పంపి, బిల్లులు పొందవచ్చు. ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా చాలాచోట్ల అమలుకావడం లేదని తెలుస్తోంది. ఫలితంగా బాధితులపైనే భారం పడుతోంది. బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతాయన్న ఉద్దేశంతో కొన్ని ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రులు...బాధిత కుటుంబాలతోనే కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం.

  • ‘ప్రైవేట్‌’లోనూ ఆరోగ్యశ్రీ బాధితులకు ఉచితంగానే వేయాలి: వైద్య, ఆరోగ్యశాఖ

ప్రభుత్వం గుర్తించిన కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరిన ఆరోగ్యశ్రీ బాధితులకు రెమిడెసివిర్‌ వాడితే బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆసుపత్రుల యాజమాన్యాలు పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరించి ఎవరివద్దనైనా డబ్బు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం పూర్తిగా తన పరిధిలోకి తెచ్చుకున్న ప్రైవేటు వైద్య కళాశాలల ఆసుపత్రులకు సైతం పడకల సంఖ్యకు అనుగుణంగా రెమిడెసివిర్‌ను ఉచితంగా అందిస్తున్నాం.

ప్రభుత్వాసుపత్రుల్లో 60వేల ఇంజెక్షన్లను వినియోగించాం

ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా 60 వేలకుపైగానే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు ఇచ్చాం. ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపిన రోజుల్లో సుమారు 20 వేల ఇంజెక్షన్లను ఒక్కోటి రూ.3,300కు కొన్నాం. అనంతరం మరో 30 వేలను ఒక్కోటి రూ.2,700కు కొన్నాం. తాజాగా టెండర్ల ద్వారా ఇంకా తక్కువకే 50వేల ఇంజెక్షన్లను కొనుగోలు చేయబోతున్నాం. గతంలో కంటే.. ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో వీటి ఉపయోగం పెరిగింది. - విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ

ఇదీ చదవండి:కిడ్నీ కొనుగోలు పేరుతో మోసం

ABOUT THE AUTHOR

...view details