కృష్ణా జలాలపై కేంద్రం గెజిట్ విడుదల చేయడాన్ని ముందడుగుగా భావిస్తున్నామని వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల(gazette on Krishna and Godavari board) పరిధులు నిర్ణయిస్తూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే గెజిట్లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని.. వాటిని సవరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. కృష్ణా జలాలపై ప్రకాశం జిల్లా వారిలో చంద్రబాబు లేనిపోని అనుమానాలను సృష్టిస్తున్నారన్న సజ్జల.. రాయలసీమ లిఫ్టు వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదన్నారు. ఈ మేరకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
చంద్రబాబు హయాంలోనే..
రాయలసీమ లిఫ్టు ఏర్పాటుకు సంబంధించి తెదేపా వైఖరి ఏంటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని, కృష్ణానదిలో 800 అడుగులోపు నీరు తీసుకునేలా ప్రాజెక్టు కడితే దాన్ని చంద్రబాబు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి పేరిట తెలంగాణ నీటిని వృథాగా వదిలేస్తే చంద్రబాబు మాట కూడా మాట్లాడటం లేదన్నారు.
ప్రకాశం జిల్లాకు నీరిచ్చే ఏర్పాట్లు
ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చు పెట్టిందన్న సజ్జల.. సాగర్ కుడి, లేదా ఎడమ కాలువ ద్వారా ప్రకాశం జిల్లాకు నీరిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రాయలసీమ లిఫ్టుతో ప్రకాశం జిల్లాకు ఏ విధంగానూ నష్టం జరగదన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి భవిష్యత్తులో మన ప్రయోజనాలకు ఎవరూ భంగం కల్గించని రీతిలో సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారన్నారు.