Sajjala on YSRCP lifetime president issue: వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటూ జులైలో జరిగిన ప్లీనరీలో చేసిన తీర్మానం ఆమోదం పొందలేదని వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జీవిత కాలం పార్టీ అధ్యక్ష పదవిని సీఎం వైఎస్ జగన్ తిరస్కరించారని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని తమను కోరినట్లు తెలిపారు. వైకాపా జీవిత కాల అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ఉండాలని జులైలో జరిగిన ప్లీనరీలో తీర్మానం చేపట్టిన మాట వాస్తవమేనన్న ఆయన.. కార్యకర్తల కోరిక మేరకు తీర్మానం చేపట్టినట్లు తెలిపారు. ఆ పదవిని వైఎస్ జగన్ తిరస్కరించినందున తీర్మానం అమల్లోకి రాలేదన్నారు. ప్లీనరీలో తీర్మానం ఆమోదం పొందలేదని, మినిట్స్లోనూ లేదన్నారు. ఈసీకీ తాము ఏ తీర్మానాన్నీ పంపలేదన్నారు.
జీవిత కాల అధ్యక్ష పదవి విషయమై స్పష్టత ఇవ్వాలని ఈసీ అడిగినందున.. ప్రస్తుతం ఆ తీర్మానం అమల్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి చెబుతామన్నారు. గత ఫిబ్రవరిలో పార్టీలో చేసిన సవరణ ప్రకారం వైఎస్ జగనే వైకాపా అధ్యక్షుడుగా ఉన్నారని సజ్జల చెప్పారు. ఐదేళ్ల పాటు అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ఉంటారని చెబుతూ అప్పట్లోనే ఈసీకి సమాచారం పంపామన్నారు. వైకాపాలో ఐదేళ్లకోసారి పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.