రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబు రాసిన లేఖ అసత్యాలమయం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలను సజ్జల ఖండించారు. తన హయాంలో 8 గంటల్లో రైతులకు ధాన్యం సేకరణ డబ్బులిచ్చానని చంద్రబాబు లేఖలో రాయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో రైతుల బకాయిలు వెయ్యి కోట్లు మిగిల్చితే... వైకాపా ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఎక్కడా గిట్టుబాటు ధర దక్కలేదని, కౌలు రైతులకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం వచ్చాకే...
వైకాపా ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. రైతులు పండించిన ప్రతి గింజను సేకరించడం సహా గిట్టబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా మొత్తాన్ని క్యాలెండర్ ప్రకారం రైతులకు అందిస్తున్నామని వెల్లడించారు. ధాన్యం సేకరణ అంశంలో భాజపా నేతల ఆరోపణలను తప్పుబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ.3 వేల కోట్లు ఉన్నాయని... వీటిని భాజపా నేతలు విడుదల చేయించి క్రెడిట్ తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.