పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాల వ్యవహారంలో సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీకి, జల శక్తి శాఖ మంత్రికి లేఖలు రాశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు రెండో డీపీఆర్‌పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదం కేవలం పాలనాపరంగా వచ్చిన సమస్యగా భావిస్తున్నామని, రాజకీయ కోణం ఎక్కడా లేదని తెలిపారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ ఖరారు చేసిన మొత్తాన్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వం కోరుతుందన్నారు.
నవంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో జరిగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలోనూ ఈ అంశాన్నే ప్రస్తావించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని సజ్జల తెలిపారు. విభజన చట్టంలో కూడా కేంద్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందని స్పష్టంగా ఉందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఆశించటం లేదని, ప్రాజెక్టు పూర్తి కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయాలని తెదేపా సహా ఇతర పక్షాలు చూశాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై శ్రద్ధ చూపకపోతే అది ఎప్పట్లోగా పూర్తి అవుతుందో చెప్పలేమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.