ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా హయాంలో రూ.30వేల కోట్లు కమీషన్లకే: సజ్జల

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికీ లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నప్పటికీ తెదేపా దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

sajjala ramakrishna
sajjala ramakrishna

By

Published : Sep 7, 2021, 10:18 AM IST

‘వివిధ సంక్షేమ పథకాల కింద అర్హులైన పేదలకు ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌ సుమారు రూ.లక్ష కోట్లను నేరుగా వారి ఖాతాల్లో వేశారు..ఇంత మొత్తం తెదేపా హయాంలో ఇచ్చి ఉంటే అందులో దాదాపు రూ.30వేల కోట్లు ఆ పార్టీ నేతలకు కమీషన్ల రూపంలో చేరేవి’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘జన్మభూమి కమిటీల దోపిడీ గురించి అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాం’ అని తెలిపారు. సోమవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో కుమ్మరి శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఆ కుల ప్రతినిధుల సమావేశంలో సజ్జల పాల్గొని మాట్లాడారు.

‘దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికీ లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నప్పటికీ తెదేపా దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత వైకాపా కార్యకర్తలపై ఉంది’ అని సూచించారు. ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి కూడా మాట్లాడారు.

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలపై త్వరలో విధివిధానాలు

పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు.. మధ్య ఆదాయ వర్గాలకు(ఎంఐజీ)కేటాయించే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని, దీనిపై త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అక్రిడిటేషన్ల జారీ ఆలస్యమైందని, ఇకపై జాప్యం జరగకుండా సమాచార శాఖకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య(ఏపీడబ్ల్యూజేఎఫ్‌) విజయవాడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

‘నకిలీలను వేరు చేసి అర్హులైన జర్నలిస్టులకు రాయితీలన్నీ అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. డిజిటల్‌ మీడియాను గుర్తించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తున్నాం. విజయవాడ, విశాఖ, హిందూపూర్‌ తదితర ప్రాంతాల్లో గతంలో పాత్రికేయులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన వివాదాలపై ఆయా జిల్లాల అధికారులతో చర్చించి పరిష్కరిస్తాం’ అని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకట్రావ్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Taliban Panjshir: తాలిబన్లకు ఎదురుదెబ్బ.. సీనియర్​ కమాండర్‌ హతం

ABOUT THE AUTHOR

...view details