ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రుసుము చెల్లిస్తేనే క్రీడా శిక్షణ.. - saap news

SAAP: రాష్ట్రంలో వేసవి క్రీడా శిక్షణ ఉచితమని చెబుతూనే పిల్లల నుంచి ప్రవేశ ఫీజులు వసూలు చేస్తున్నారు. పలుచోట్ల కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. క్రీడా మైదానాల్లో ప్రవేశ పెట్టిన చెల్లించు- ఆటలాడు (పే అండ్‌ ప్లే) విధానాన్నే వేసవి శిక్షణ శిబిరాల్లోనూ అమలు చేస్తున్నారు. దీంతో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు.. పేద విద్యార్థులకు దూరమవుతున్నాయి. శాప్‌ విధానాలపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

రుసుము చెల్లిస్తేనే క్రీడా శిక్షణ
రుసుము చెల్లిస్తేనే క్రీడా శిక్షణ

By

Published : May 23, 2022, 7:14 AM IST

Fee to Sports Training: రాష్ట్రంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు పేద విద్యార్థులకు భా(దూ)రమవుతున్నాయి. ఉచితమని చెబుతూనే పిల్లల నుంచి రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌), జిల్లా క్రీడా పాధికార సంస్థలకు (డీఎస్‌ఏ) చెందిన శిక్షకులు విద్యార్థుల నుంచి పలుచోట్ల కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.1,500 చొప్పున ప్రవేశ రుసుములు వసూలు చేస్తున్నారు. క్రీడా మైదానాల్లో ప్రవేశ పెట్టిన చెల్లించు- ఆటలాడు (పే అండ్‌ ప్లే) విధానాన్నే వేసవి శిక్షణ శిబిరాల్లోనూ అమలు చేస్తున్నారు. పాఠశాలలకు సెలవులు కావడంతో పిల్లల ఆసక్తి మేరకు ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలకు పంపాలని భావించిన తల్లిదండ్రులు రుసుముల కారణంగా వెనకడుగు వేస్తున్నారు. శాప్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,276 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు పది రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. 20 వేల మందికిపైగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధానం:పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ఏటా వేసవిలో శాప్‌ ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ శిబిరాలను 30 రోజులపాటు నిర్వహిస్తుంటారు. ఆసక్తి కలిగిన విద్యార్థులకు 35 నుంచి 45 క్రీడాంశాల్లో నిపుణులతో ఉచితంగా శిక్షణ ఇస్తుంటారు. బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌, టెన్నిస్‌ వంటి క్రీడలకు నామమాత్రం ఫీజు వసూలు చేసేవారు. హాజరైన విద్యార్థులకు పౌష్టికాహారం కింద గుడ్డు, పాలు అందించేవారు. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా శిబిరాలు నిర్వహించలేదు. ఈసారి ప్రారంభించినా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రవేశ రుసుములు వసూలు చేస్తుండటం దుమారం రేపుతోంది. అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతున్నా... వీరి నుంచి వెళ్లిన మౌఖిక ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో శిక్షకులు రుసుములు వసూలు చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. శిబిరాలకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్టికాహారం అత్యధిక జిల్లాల్లో అందించడం లేదు.

భగ్గుమంటున్న క్రీడా సంఘాలు:వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో ప్రవేశ రుసుములు వసూలు చేయడంపై పలు క్రీడా సంఘాలు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లల నుంచీ రుసుములు వసూలు చేస్తూ వారిలో ఉత్సాహాన్ని దెబ్బతీస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఉచితంగా శిక్షణ అని చెప్పి విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల భారీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.

తెల్ల రేషన్‌ కార్డు కలిగిన వారికి మినహాయింపు:మైదానాల నిర్వహణ, విద్యుత్తు ఛార్జీల కోసం కొన్ని క్రీడాంశాల విషయంలో వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థుల నుంచి స్వల్పంగా ఫీజులు వసూలు చేయక తప్పదని శాప్‌ వర్గాలు చెబుతున్నాయి. స్విమ్మింగ్‌, జిమ్నాస్టిక్స్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడలకు నిర్వహణ ఖర్చులు ఉంటాయని పేర్కొంటున్నాయి. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన విద్యార్థులకు ఫీజుల విషయంలో పూర్తిగా మినహాయింపు ఇస్తున్నామని వివరించాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details