కరోనా..విద్యా విధానంలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఆన్లైన్, డిజిటల్ బోధనను అన్ని వర్గాల విద్యార్థులకు పరిచయం చేసింది. పట్టణ ప్రాంత విద్యార్థులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో పట్టున్న, అంతకుమునుపే డిజిటల్ తరగతులకు అలవాటుపడిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యాభాసాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. గ్రామీణ, నిరుపేద కుటుంబాల్లోని పిల్లలు మాత్రం ఈ పరిణామాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. టీవీ పాఠాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపినప్పటికీ, సరైన సదుపాయాల్లేని లక్షల మంది వాటికీ దూరమయ్యారు. ఏకపక్షంగా సాగే పాఠాలు అర్థం చేసుకునే సామర్థ్యాలు కొరవడి కొందరు..సందేహాలు తీర్చేవారు లేక గందరగోళానికి గురై ఇంకొందరు..టీవీ, సెల్ఫోన్, ల్యాప్టాప్ వంటివి కొనుక్కునే సామర్థ్యం లేక మరికొందరు.. ఇలా లక్షల మంది ప్రస్తుతం చదువుకు దూరంగా జరిగారు. ఇది మనవల్ల అయ్యే పని కాదులే అని కూలిపనులకు వెళ్తూ..బర్లు,గొర్లు కాస్తూ కాలం గడుపుతున్నారు.
టీవీ పాఠాలతో ఏం ఉపయోగం..?
‘ఈనాడు- ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పుడు ఒక్కో గ్రామంలో లెక్కకుమిక్కిలి పిల్లలు పాఠాలు కొనసాగే సమయంలోనే పత్తిచేలలో, చేనేత మగ్గాల దగ్గర పనులు చేస్తూ కన్పించారు. రాష్ట్రంలో సెప్టెంబరు ఒకటి నుంచి టీవీ పాఠాలు మొదలయ్యాయి. ‘ఈనాడు- ఈటీవీ భారత్’ యంత్రాంగం పలు గ్రామాల్లో పరిశీలించగా టీవీ పాఠాలు ప్రసారం అయ్యే సమయంలోనూ పలువురు విద్యార్థులు వాటిని వినకుండా పొలాల్లో ఉండటం, ఇంటి పనులు చేస్తుండటం కన్పించింది. ఈ పోకడ మారుమూల గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఏజెన్సీ గ్రామాలైన మచ్చర్ల, మట్టెవాడ, ఊట్ల, నేలవంచ, కొంగరగిద్ద, దొరవారితిమ్మాపురం తదితర ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్లైన్ చదువుల గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు కన్పించలేదు. బడికి వెళ్తేనే అంతంతమాత్రంగా చదువు వస్తోందని, రెండు గంటల టీవీ పాఠాలతో ఏం ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయాన్ని ఎక్కువమంది తల్లిదండ్రులు వ్యక్తంచేశారు. అందుకే పిల్లల్ని పనులకు తీసుకెళ్తున్నట్టు వెల్లడించారు.
అందుకే పనులకు తీసుకెళ్తున్నాం..
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో ఆర్థిక స్థోమత లేని కుటుంబాలు తమ పిల్లలకు ఇప్పటికీ స్మార్ట్ఫోన్లూ సమకూర్చలేదు. నానా తంటాలు పడి సమకూర్చినా సిగ్నల్స్ లేకపోవడం వంటి కారణాలతో పిల్లలు డిజిటల్ పాఠాలకు దూరంగా ఉంటున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వెలిబుచ్చారు. ‘గట్టు మండలంలో టీవీ పాఠాలు ప్రసారమైన తొలి రోజుల్లో సుమారు 50 శాతానికి పైగా విద్యార్థులు వాటిని వీక్షించారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 శాతం కన్నా తక్కువగానే ఉన్నట్టు మా పరిశీలనలో తేలింది’ అని అక్కడి ఉపాధ్యాయులు తెలిపారు.
‘చాలామంది పిల్లలు పత్తి చేలలో పనులకు వెళ్తున్నారు. తల్లిదండ్రులను అడిగితే బడులు లేవు కదా? అందుకే పనులకు తీసుకెళ్తున్నాం. రోజుకు రూ.200 వస్తున్నాయనే సమాధానమిస్తున్నారు. - సంగారెడ్డి జిల్లా చిలప్చేడ్ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు
ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందలాది గ్రామాల్లో వేలాది విద్యార్థులు చదువులకు దూరమై, ఇతర పనులకు అలవాటుపడుతున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే వారంతా అర్ధంతరంగా బడి మానేసే ప్రమాదం లేకపోలేదని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఆ వాదనను పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. ‘అర్ధంతరంగా చదువు ఆపేసే వారు రాష్ట్రంలో అంతగా ఉండకపోవచ్చు. కనీసం 50 శాతం మంది మధ్యాహ్న భోజనం కోసం బడులకు వస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
అధ్యయనాలూ హెచ్చరిస్తున్నాయి...
దీర్ఘకాలం బడులు మూతపడటం వల్ల భారీ సంఖ్యలో విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని, డ్రాపౌట్లు అధికమవుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారత్లో ఈ ఏడాది 50లక్షల మందికిపైగా పాఠశాల విద్యార్థులు చదువు మానేయనున్నారని ప్రపంచ బ్యాంకు ఓ అధ్యయనం ద్వారా ఇప్పటికే హెచ్చరించింది. యంగ్ లైవ్స్ ఇండియా తాజా అధ్యయనం ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో 35 శాతం మంది పిల్లలు ఇతర కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుంటున్నారని వెల్లడించింది. అంతర్జాలం సదుపాయం లేనివారు 72% మంది, టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం లేనివారు 42 శాతం మంది ఉన్నట్లు తెలిపింది.