ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాత జిల్లాలకు కౌంట్ డౌన్.. మిగిలింది ఒక్కరోజే.. ఇదో భావోద్వేగ సమయం..! - old districts in ap

New districts in AP: ఉగాది పర్వదినం వేళ రాష్ట్రంలో ఒక భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంది. అది మూడు విధాలుగా ఉంది. తమకు కొత్త జిల్లా ఏర్పడుతోందన్న ఆనందం కొందరిలో ఉంది. కోరుకున్న జిల్లా దక్కలేదన్న భావన మరికొందరిలో ఉంది. ఈ రెండు ఫీలింగ్స్ కాకుండా.. మూడోది చాలా మందిలో ఉంది. దశాబ్దాల నుంచి నేటివరకూ ఒక జిల్లా పేరుతో భావోద్వేగ బంధాన్ని పెనవేసుకున్నవారు.. మరో రోజు గడిస్తే.. సరికొత్త జిల్లా వాసులుగా మారిపోబోతున్నారు. నా ఊరు.. నా దేశం అనే భావన ఎలాంటిదో.. నా జిల్లా అనే భావన సైతం అటువంటిదే. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లినా పలానా జిల్లా వాసులం అంటూ చెప్పుకున్న వారంతా.. సోమవారం నుంచి మరో జిల్లా వాసులైపోతారు. ఇదో ప్రత్యేక సందర్భం. పాత జిల్లా పేరుతో పెంచుకున్న బంధానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త జిల్లాకు ఆహ్వానం పలకాల్సిన సమయాన, బయటికి కనిపించని ఉద్వేగం మనసులో పలికే సమయమిది..!

పాత జిల్లాలకు కౌంట్ డౌన్.. ఇదో భావోద్వేగ సమయం..!
పాత జిల్లాలకు కౌంట్ డౌన్.. ఇదో భావోద్వేగ సమయం..!

By

Published : Apr 2, 2022, 5:14 PM IST

Updated : Apr 2, 2022, 6:18 PM IST

New districts in AP: రాష్ట్రంలో కొత్త జిల్లాల అవతరణకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్‌ 4వ తేదిన సరిగ్గా ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ నిర్ణయం ప్రకారం.. 4వ తేదీ నుంచి రాష్ట్రంలో 26 జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్‌.. ప్రజల నుంచి వచ్చిన 16 వేల 600 సలహాలు, అభ్యంతరాలు, సూచనలు, అభిప్రాయాలను వడపోశారు.

ఎన్నో డిమాండ్లు.. ఎన్నో పోరాటాలు: ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటించిన వెంటనే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. అందులో కొన్ని చర్చల దశలోనే ఆగిపోతే.. మరికొన్ని పోరాటాలకు దారి తీశాయి. ఇంకొన్ని దీక్షల వరకూ వెళ్లాయి. జిల్లా కేంద్రం మార్చాలని, జిల్లా పేరు మార్చాలని, తమ ప్రాంతానికి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని.. ఇలా చాలా డిమాండ్లు వినిపించాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపల వేలాది వినతులు వెల్లువెత్తాయి. రాజకీయ కారణాలతోనే మెజారిటీ జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విపక్ష నేతలు విమర్శించారు. వాటన్నింటినీ దాటుకొని మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధపడింది.

వడివడిగా అడుగులు : కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే కార్యాలయాలు సిద్ధమయ్యాయి. అందులో సౌకర్యాల ఏర్పాటు సైతం పూర్తి కావొచ్చింది. వాస్తవానికి ఉగాది రోజునుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.. కానీ వివిధ కారణాలతో నాలుగో తేదీ నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయని ప్రకటించింది. సర్కారు ఆదేశాల ప్రకారం.. అధికారులు పనుల పర్యవేక్షణ వేగవంతం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాల్లో వసతుల కల్పన పనులు వేగిరం చేశారు.

అధికారులకు ఆదేశాలు : కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఉన్నతాధికారులూ రాజధానిలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతోపాటు విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు.. హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కావొద్దని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం.. అధికారులందరితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఈ మోమో జారీ చేసినట్టు సమాచారం.

మిగిలింది ఒక్క రోజే : 2వ తేదీన ఉగాది.. 4వ తేదీన కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. అంటే.. పాత జిల్లాతో దశాబ్దాల అనుబంధం పెనవేసుకున్న వారికి మధ్యలో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. కొత్త జిల్లా ఎంత మందిలో సంతోషం నింపుతుందన్నది తెలియదుగానీ.. పాత జిల్లా నుంచి విడిపోతున్న ఉద్వేగం మాత్రం అందరిలో మనసుల్లో గూడు కట్టుకునే అవకాశం లేకపోలేదు. అయితే.. కాలం గొప్పది. ఎవరికోసమూ ఆగదు. దేని గురించీ ఆలోచించదు. భవిష్యత్ వైపు అలా సాగిపోతూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా.. చేదు, తీపి గుర్తులను మదిలో నిలుకుంటూ ముందుకు సాగడమే. ఈ శుభక్రుత్ నామ సంవత్సరాన.. తల్లుల్లాంటి పాత జిల్లాలు, పిల్లలాంటి కొత్త జిల్లాలు.. అభివృద్ధి వైపు పురోగమిస్తూ.. అందరి జీవితాలూ ఆనందమయం కావాలని కోరుకుందాం.

Last Updated : Apr 2, 2022, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details