సాధారణ ఎన్నికలతో పోల్చితే స్థానిక సంస్థల సంగ్రామం ప్రతిష్ఠాత్మకంగానే ఉంటుంది. వార్డుల్లోని ప్రతి ఇంటి ఓట్లను తమకే దక్కాలని ఆయా పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు వేసుకుంటుంటారు. విజయం సాధించేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భారీస్థాయిలో ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనల ప్రకారమే వారు నడుచుకోవాలి. అభ్యర్థులు ఖర్చుపెట్టే ప్రతి రూపాయిని లెక్కచెప్పాల్సిందే. దానికి అనుగుణంగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. సర్పంచి అభ్యర్థితోపాటు, వార్డు సభ్యులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఎవరెవరు ఎంత ఖర్చుపెట్టాలి..?
పదివేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీల్లో పోటీచేస్తున్న సర్పంచి అభ్యర్థి రూ.2.50 లక్షలు, పదివేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డు సభ్యులుగా పోటీచేసే పంచాయతీల్లో జనాభా పదివేలకుపైగా ఉంటే రూ.50 వేలు, అంతకంటే తక్కువ ఉంటే రూ.30 వేలు మాత్రమే వ్యయం చేయాలి.