నష్టాల్లో కూరుకుపోతున్న ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. కరోనా కారణంగా దుకాణాల అద్దె ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీనిని భర్తీ చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ ఇటీవల పీఎన్‌బీఎస్‌లో రెండు రోజుల పాటు తనిఖీలు చేశారు. చాలా షాపులు ఖాళీగా ఉండడం గమనించారు. జనసమ్మర్ధంగా ఉండే బస్టాండులోని ఖాళీలను తక్షణం నింపాలని కృష్ణా రీజియన్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఖాళీ షాపులకు టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని ద్వారా అదనంగా రూ. 40 లక్షలు వరకు ఆదాయం సమకూరుతుందని లెక్కలు వేస్తున్నారు.
*పీఎన్‌బీఎస్‌లోని దుకాణాలను అద్దెకు ఇవ్వడం ద్వారా శాఖకు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడికి రోజూ సుమారు 3 వేల వరకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. సిటీ పోర్టు నుంచి 400 పైగా సర్వీసులు తిరుగుతుంటాయి. రోజుకు సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇంత రద్దీగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ఆదాయం కోసం వాణిజ్య దుకాణాలను నిర్మించారు. ఎరైవల్, డిపార్చర్ బ్లాక్‌లతో పాటు సిటీ టెర్మినల్‌లో కలిపి 145 వరకు గదులు ఉన్నాయి. ఏటీఎం కేంద్రాలు, హోటళ్లు, నిరీక్షణ గదులు, డార్మిటరీలు, చిరుతిళ్లు, శీతల పానీయాలు, ఇంటర్నెట్, సినిమా హాలు, టీ స్టాళ్లు, ఫ్యాన్సీ, తదితర వాటికి అద్దెకు ఇచ్చారు. వీటిల్లో విస్తీర్ణాన్ని బట్టి అద్దెను నిర్ణయించారు. కనిష్టం రూ. 15 వేలు నుంచి గరిష్ఠంగా రూ. 25 లక్షల వరకు నెలవారీ అద్దె ఉంది. వీటన్నింటి ద్వారా దాదాపు రూ. 1.50 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.