RTC Retired Employees Problems: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆనందపడ్డారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్న సీఎం జగన్ మాటలు నమ్మి సంతోషించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు అందుతాయని ఆశపడిన ఆర్టీసీ ఉద్యోగులకు మొండిచెయ్యే ఎదురైంది. పేరుకు మాత్రం ప్రభుత్వంలో విలీనం చేశారు కానీ.. సమస్యలు, సౌకర్యాలను పట్టించుకోకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేయింబవళ్లు విధులు నిర్వహించి అనారోగ్యానికి గురైన తమను పట్టించుకొనే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతికి గాయాలు, మెడకు ఆపరేషన్లు, కిడ్నీ, గుండె జబ్బులతో బాధపడుతున్న వీరంతా.. ఒకప్పుడు ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టించిన రథసారధులే. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారీ ఆర్టీసీ విశ్రాంత కార్మికులు. విధినిర్వహణలో అందరితో శభాష్ అనిపించుకున్న వీరు.. పదవీ విరమణ అనంతరం కష్టాలు పడుతున్నారు. వీరిలో చాలా మందిని తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వైద్య ఖర్చులు భరించలేక అప్పులతో అవస్థలు పడుతున్న వీరికి.. సీఎం జగన్ చేసిన విలీన ప్రకటనతో ప్రాణం లేచివచ్చినట్లయింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయంతో కష్టాలు తీరిపోతాయని సంతోషించారు. కానీ, నేటికి ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో.. తమ గోడు వెల్లబోసుకుంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖలు రాస్తూనే ఉన్నారు.