ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి రెండురోజులు జ్వరం వచ్చింది. 101-102 డిగ్రీలకు తగ్గడం లేదు. యాంటిజెన్‌తో పాటు ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష కూడా చేయించుకున్నాడు. రెండింటిలోనూ ‘నెగెటివ్’ అనే ఫలితం వచ్చింది. హమ్మయ్య.. కొవిడ్ లేదని ఊపిరి పీల్చుకున్నాడు. సాధారణ జ్వరం మాత్రలు వాడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. వారం గడిచేసరికి జ్వరం తగ్గకపోగా.. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. వెంటనే ఆసుపత్రిలో చేరాడు. అక్కడ పరీక్షిస్తే రక్తంలో ఆక్సిజన్ 87-90 శాతం మధ్య చూపిస్తోంది. అక్కడ కూడా ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేయగా నెగెటివ్‌గానే తేలింది. అనుమానం వచ్చి సీటీ స్కాన్ చేయగా.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ బయటపడింది.
ఆర్‌టీ పీసీఆర్.. కొవిడ్ నిర్ధారణకు నమ్మకమైన, ఉత్తమమైన పరీక్ష ఇది. అందులో అనుమానం అక్కర్లేదు. ఈ పరీక్ష చేస్తే కరోనా వైరస్ సోకిందా? లేదా? అనేది స్పష్టమవుతోంది. అయితే కేవలం ఆర్‌టీ పీసీఆర్ చేసినంత మాత్రాన అన్నిసార్లూ కొవిడ్ పూర్తిగా తెలిసిపోతుందనుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఇందులో నెగెటివ్ వస్తే.. ఇక వైరస్ సోకలేదని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష సామర్థ్యం 70-80 శాతం మాత్రమే. మిగిలిన 20-30 శాతంలో వైరస్‌ను గుర్తించలేకపోవచ్చు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నా.. ఆర్‌టీ పీసీఆర్‌లో నెగెటివ్ వచ్చిందనే కారణంతో ఎక్కువమంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తమకు వైరస్ సోకలేదని భావిస్తూ.. లక్షణాలున్నా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం మరింత క్షీణించిన తర్వాత అప్పుడు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇటువంటి వారిలో 5 నుంచి 7 రోజుల్లోనే వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. అందుకే లక్షణాలు కనిపిస్తున్నప్పుడు.. ఆర్‌టీ పీసీఆర్ నెగెటివ్‌ను పూర్తిస్థాయిలో విశ్వసించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సీటీ స్కాన్‌కు వెళ్లడం మంచిదని చెబుతున్నారు.
ఆర్‌టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా.. ఎప్పుడు ప్రమాదకరం?
* జ్వరం: మూడు రోజులకు పైగా జ్వరం తీవ్రంగా వస్తుంటే అనుమానించాలి. అంటే పారాసెటమాల్ వేసుకుంటున్నా కూడా శరీరం స్పందించకుండా.. 101 డిగ్రీలు ఆపైన జ్వరం కనిపిస్తుంటే వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిందే.
* ఆక్సిజన్:పల్స్ ఆక్సీమీటర్‌లో రక్తంలో ఆక్సిజన్ శాతం 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే కొవిడ్ కావచ్చేమోనని సందేహించాలి. రెండు మూడు గంటల్లో వేర్వేరుగా పరిశీలించినా కూడా.. 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే అది ప్రమాదానికి సంకేతమే. అది కొవిడా? కాదా? అనేది తర్వాత సంగతి. ముందు అత్యవసరంగా వైద్యసేవల కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
*రక్త పరీక్షలు:జ్వరం తగ్గడం లేదు. రక్తంలో ఆక్సిజన్ శాతం మాత్రం 94 కంటే పైనే చూపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎల్‌డీహెచ్, ఫెరిటిన్, సీఆర్‌పీ తదితర కొన్ని రక్తపరీక్షలు చేయించాలి. ఇవి రక్తంలో ఇన్‌ఫ్లేమటరీని సూచిస్తాయి. ఈ మూడింటిలో ఫలితాలు సాధారణం కంటే రెట్టింపు గనుక నమోదైతే.. వెంటనే అత్యవసరంగా వైద్యసేవలు పొందాలి.
*ఇటువంటి సమయాల్లో ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఇంట్లోనే ఉండిపోవద్దు. సొంతంగా చికిత్స కూడా పొందొద్దు. ఈ పరిస్థితుల్లో వైద్యుని పాత్ర చాలా ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి.
సీటీ స్కాన్ ఎప్పుడు అవసరం?