తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని నాగార్జున కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభ ద్వారా.. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరబోతున్నారు. ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన రాజ్యాధికార సంకల్ప సభ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. బహుజన ఉద్యమకారులు, స్వైరో సంస్థ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
RS PRAVEEN KUMAR: నేడు బీఎస్పీలో చేరనున్న ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ - నల్గొండలో సభ
ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణలోని నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాజ్యాధికార సంకల్ప సభ పేరిట జరగనున్న కార్యక్రమానికి బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్ పల్లి సహా వివిధ ప్రాంతాలు పర్యటించి రాజకీయ కార్యాచరణను ప్రవీణ్ కుమార్ ప్రాథమికంగా ప్రకటించారు. స్వైరో కార్యకర్తలు పది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పల్లెపల్లెన తిరుగుతూ నల్గొండ సభకు జనసమీకరణ చేపట్టారు. తొలుత నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించనున్నారు. అనంతరం మర్రిగూడ బైపాస్ నుంచి సభా వేదిక వరకు ర్యాలీ చేపడతారు.