తెలంగాణలోని గురుకుల పాఠశాలల, కళాశాలల డైరెక్టర్‌గా పనిచేసి.. ఇటీవల ఐపీఎస్ విధుల నుంచి స్వచ్ఛంద విశ్రాంతి తీసుకున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.. బడుగు బలహీనవర్గాల గొంతుక అయ్యేందుకే తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన.. మల్కాపూర్‌లో ఓ టీ స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం స్పేరోస్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పూలే, అంబేడ్కర్, కాన్సీరం బాటలోనే పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే తనపై కేసులు నమోదె చేయడం దారుణమన్నారు. లక్ష్యం కోసం తాను చావడానికైనా సిద్ధమని పేర్కొన్నారు.
'దేనికీ భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా..! చాలా ఇన్ఫర్మేషన్ లాగుతుంటరు. మీకు చాలా ఫోన్లు వస్తుంటాయి. కేసులు పెడ్తుంటరు. నేను రిటైర్ అయిన మరుసటి రోజే నా మీద కరీంనగర్లో పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కేసులకు భయపడేటోడు ప్రవీణ్ కుమారా? నేను వెనక్కి పొయ్యే సమస్యే లేదు మిత్రులారా.! ఈ రోజు ఒక చిన్నారి బిడ్డ గొప్పగా పాట పాడింది. రాశి.. అద్భుతంగా అంబేడ్కర్ సాహెబ్ మెసేజ్ ఇచ్చింది. ఈ బిడ్డకు ఉన్న ధైర్యం ఆ 29 మంది ఎమ్మెల్యేలకు ఉంటే బాగుంటుండే.
- ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి
తెలంగాణ రాష్ట్రంలో సగం గురుకులాలకు భవనాలు లేవవని, నిధులు విడుదల కావడం లేదని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హజూరాబాద్‌లో దళితబంధు పేరిట ఖర్చు చేస్తున్న నిధులతో ఎంతోమంది చిన్నారులను గొప్పవ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు నిధులు లేక అక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించే ఎమ్మెల్యే కరవయ్యాడని తీవ్రంగా విమర్శలు చేశారు.