ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mahanadu-2021: ప్రతీ కుటుంబంపై రూ.2.50లక్షల భారం మోపారు: చంద్రబాబు - AP News

తెదేపా మహానాడు(Mahanadu-2021)లో నేతలు వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మాణాలు ప్రవేశపెట్టి.. సీఎం జగన్ తీరును ఎండగడుతున్నారు. ప్రతీ కుటుంబంపై రూ.2.50లక్షల భారం మోపారని పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే పాత బ్రాండ్లు పక్కనపెట్టి కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడమనే కొత్త నిర్వచనం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని... వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. దొంగలెక్కలు రాయటంలో సిద్ధహస్తులంతా ఒకచోట చేరి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కూన రవికుమార్ దుయ్యబట్టారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : May 27, 2021, 6:48 PM IST

రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.2.50లక్షల భారం మోపారని తెలుగుదేశం అధినేత చంద్రబాబుధ్వజమెత్తారు. అత్యాశ, అహంకారంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ధరల పెరుగుదల అంశంపై మాట్లాడుతూ... "ఆదాయం పెంచి ఖర్చులు తగ్గిస్తే అది సుపరిపాలనకు నిదర్శనం. ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తోంది. మద్యంలో ఏడాదికి రూ.5వేల కోట్లు చొప్పున 5ఏళ్లలో 25వేల కోట్లు దోచుకుంటున్నారు. భారతీ సిమెంట్​కు లబ్ధి చేకూర్చేందుకు సిమెంట్ ధరలు పెంచారు. కొత్త అప్పు కోసం ప్రజలపై భారం మోపేందుకు వెనుకాడట్లేదు. చేసిన అప్పుల్ని ఎలా తిరిగి కడతారో సమాధానం లేదు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ, ఇకనైనా మొద్దు నిద్ర వీడి ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలి." అని డిమాండ్ చేస్తూ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.

ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి: గోరంట్ల

ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. మహానాడులో "అదుపులేని ధరలు- పెంచిన పన్నులు-అప్పులు" అంశంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్, మహ్మద్ నజీర్ బలపరిచారు.

ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ "సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షకోట్లు దోచిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చి లక్షల కోట్లు దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్నారు. మద్యం, ఇసుక, సిమెంట్ ఇలా ప్రతిదాన్లో అవినీతే. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడుస్తోంది. రైతు పంటలకు మాత్రం గిట్టుబాటు ధర దక్కట్లేదు. కేజీకి రూపాయి కూడా రాక టమోటా రైతులు రోడ్డుపై పంటను పారబోస్తున్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా రైతుల పరిస్థితి ఉంది. రైతుల వద్ద పెరగని ధరలు ప్రజల వద్ద మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయం నుంచి ధరలను స్థిరీకరించి ప్రజల్ని ఆదుకోవాలి." అని డిమాండ్ చేశారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే పాత బ్రాండ్లు పక్కనపెట్టి కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడమనే కొత్త నిర్వచనం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని... వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. "నియంత పాలనలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరు. ప్రజల్ని అక్కున చేర్చుకోవాల్సిన సీఎం ధరలు పెంచి ఎందుకంత అక్కసు వెళ్లగక్కుతున్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరి రక్తాన్ని పీల్చుతున్నారు. అభివృద్ధి అంటే పార్టీ నేతల జేబులు నింపుకోవటంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సామాన్యుల ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిపోతుంటే ఎలా అభివృద్ధి అంటారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి." అని డిమాండ్ చేశారు.

దొంగలెక్కలు రాయటంలో సిద్ధహస్తులంతా ఒకచోట చేరి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కూన రవికుమార్ దుయ్యబట్టారు. "నవ రత్నాల పేరిట నకిలీ రత్నాలు ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన 40పథకాలను రద్దు చేసి 9పథకాలు ఇస్తూ సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టించారు. క్విడ్ ప్రోకో అనేది జగన్మోహన్ రెడ్డి అలవాటైన పని. ఆనాడు అయిదేళ్లలో లక్షకోట్లు దోపిడీ చేస్తే ఇప్పుడు ఏడాదికి లక్ష కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్ప చేసి పప్పు కూడు తినాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు. ప్రతిఒక్కరికీ సంక్షేమం అందాలి. ప్రజలు తిరగబడే రోజు వచ్చింది." అని హెచ్చరించారు.

ఇదీ చదవండీ... TDP Mahanadu: 'మహానాడు.. తెలుగుజాతికి పండుగ రోజు'

ABOUT THE AUTHOR

...view details