రాజధాని రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వార్షిక కౌలును.. ఎట్టకేలకు సీఆర్‌డీఏ మంజూరు చేసింది. సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు, వ్యక్తులకు వారి ఖాతాల్లో రెండు విడతల్లో ఆ నిధులను జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కౌలు చెల్లింపు కోసం రూ.208 కోట్లకు బడ్జెట్‌ను విడుదల చేసింది. దీని నుంచి సుమారు 23వేల మందికి పైగా రైతులకు రూ.184 కోట్లను వారి వారి ఖాతాల్లో జమ చేశారు.
ఈ నెల 27న రూ.112 కోట్లు, మంగళవారం మిగిలిన రూ.72 కోట్లను వేశారు. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రూ.195 కోట్లకు బడ్జెట్ విడుదల చేయగా.. రూ.188 కోట్లను కౌలు కింద చెల్లించారు. ఈ ఏడాది కూడా వివాదాలు, విచారణలో ఉన్న భూములను మినహాయించారు. అసైన్డ్ భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం విదితమే. అలాగే పట్టా భూములకు సంబంధించిన వివాదాలు కోర్టుల్లో ఉన్నందున వీటికి కూడా ప్రతిపాదనలు తయారు చేయలేదు. ఇవి కొలిక్కి వచ్చిన తర్వాత కౌలు ఇస్తామని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.