అధిక వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా... అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ తదితర తోటలను చీడపీడలు చుట్టుముట్టాయి. విదేశాలకు ఎగుమతి చేసినా 15 నుంచి 20 రోజులకుపైగా ఎలాంటి ఇబ్బంది రాని అరటి... వారం కూడా నిల్వ ఉండటం లేదు. నిగనిగలాడే జామ కాయను.. కోసి చూస్తే పురుగులుంటున్నాయి. ఫలితంగా రైతులు దారుణంగా దెబ్బతింటున్నారు.
మందులు కొట్టినా లొంగని వైరస్
బొప్పాయికి వైరస్ తాకిడి తీవ్రమవుతోంది. మొక్కలు నాటిన కొన్నాళ్లకే ఆకులు పసుపు రంగులోకి మారి గిడసబారుతున్నాయి. నివారణకు మందుల పిచికారీకి ఎకరాకు రూ.20వేలకు పైగా ఖర్చవుతోందని రైతులు పేర్కొంటున్నారు. పైగా గిట్టుబాటు ధరలూ లభించక పలువురు రైతులు తోటలనే తొలగిస్తున్నారు. ‘వైరస్ నివారణకు అధిక మొత్తంలో ఖర్చు చేశాం. అయితే ఏప్రిల్‌లో కిలో రూ.14 ఉన్న ధర, సెప్టెంబరులో రూ.3కి పడిపోవడంతో ఎకరాకు 15 టన్నుల పంటను వదిలేశాం’ అని ప్రకాశం జిల్లా శ్రీనివాసనగర్ రైతు నూతి ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా రంగంపేట రైతు శ్రీనివాసరావు వాపోయారు.
చెట్టుకే పండిపోతున్న అరటి
అనంతపురం, కడప, కర్నూలు, కోస్తా జిల్లాల్లో ఎగుమతికి వీలున్న జీ9 రకాన్ని, మిగిలినచోట్ల నాటు రకాలను సాగు చేస్తున్నారు. సిగటోకా తెగులుతో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. కాయలు చెట్టుపైనే పండిపోతున్నాయి. పంజాబ్, హరియాణా, కశ్మీర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న కాయలు అక్కడ దిగుమతి చేసే సమయానికే పాడవుతున్నాయి. ‘11 ఎకరాల్లో అరటికి రూ.12 లక్షలు పైనే పెట్టుబడి పెట్టా.. అసలు సొమ్ము కూడా చేతికొచ్చేలా లేదు, గతంలో కిలో రూ.14 నుంచి రూ.15 ఉండే ధర.. ఇప్పుడు రూ.4 చొప్పునే ఉంది’ అని అనంతపురం జిల్లా పుట్లూరు రైతు పరమేశ్వరరెడ్డి వాపోతున్నారు.