Role of womens in the Amravati movement: ఐదు కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం తమకు అన్నం పెడుతున్న నేలతల్లినిస్తే ఆ కన్నతల్లులకు మిగిలింది కన్నీరే. ఫలితంగా ఊరే దాటని ఆ మహిళలు... తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తడానికి ఊరూరా తిరిగారు. అడుగేస్తే అరెస్టు... కూర్చుంటే కేసు... ప్రశ్నిస్తే గృహ నిర్భందంతో ఎంత కట్టుదిట్టం చేసినా మొక్కవోని పటిమ చూపారు. 800 రోజులకుపైగా సాగుతున్న రాజధాని అమరావతి ఉద్యమంలో స్థానిక మహిళలు ఎదుర్కోని అకృత్యం, అరాచకం లేదు. కానీ... వీటన్నింటినీ పంటి బిగువన భరించి ఉద్యమాన్ని ముందుండి నడిపించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. సత్య సంకల్పంతో, శాంతి మార్గంలో ఎల్లలు దాటిన వారి సుదీర్ఘ పోరాటానికి ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. ఆ స్పూర్తిని కొనసాగిస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించడం కాదు... రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించేదాకా మా ఉద్యమం కొనసాగిస్తామంటున్నారా ధీర వనితలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలతో ‘ఈనాడు-ఈటీవీ’ ‘రాజధాని రుద్రమలు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళలు తమ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు.
అమ్మా...! నన్ను మర్చిపోయావా అన్నాడు..
ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు మీదికి ఈడ్చంతో అమరావతి ఉద్యమంలో భాగస్వామినయ్యా. 45 రోజుల పాదయాత్రలోనూ పాల్గొన్నా. నా ఇద్దరు పిల్లల్ని బంధువుల ఇంట్లో ఉంచా. ఇంటికి తిరిగొచ్చాక ‘అమ్మా నన్ను మర్చిపోయావా’ అని మా అబ్బాయి అడిగినప్పుడు... నా కళ్లలో నీళ్లు తిరిగాయి. - రాయపాటి శైలజ, గుంటూరు
హేళన చేసిన వారే ముక్కున వేలేసుకున్నారు..
వీరా ఉద్యమం చేసేది... రెండు రోజుల్లో ముగిస్తారని హేళన చేసినవారే ముక్కున వేలేసుకునేలా చేశాం. ఏదైనా శుభకార్యానికి ఒంటరిగా వెళ్లడానికే వెనుకాడే మేము రాజధాని కోసం వేదికలెక్కి నిరసన తెలిపాం. గతంలో పోలీసులంటేనే ఎరగని మమ్మల్ని వైకాపా ప్రభుత్వం పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టింది. - నాగమల్లేశ్వరి, మందడం
మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు..
ఉద్యమంలో పాల్గొన్నందుకు మమ్మల్ని ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. పోలీసులతో కొట్టించింది. మన పిల్లలు చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతూ... అక్కడ నానా అవస్థలు పడుతున్నారని భావించి రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చాం. - షేక్ మాలింబీ, రాయపూడి