ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గంటకు రూ.రెండున్నర లక్షలు.. రోజుకు రూ.అర కోటిపైనే.. - తెలంగాణలో పెరుగుతున్న చోరీలు

Robberies Increasing: తెలంగాణలో రోజుకు రూ.అర కోటి చోరులపాలు అవుతుంది అంటే నమ్మగలమా? కానీ నమ్మితీరాల్సిందే అంటున్నారు పోలీసులు. కష్టపడి కూడబెట్టిన సొమ్ము చోరులపాలు కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే.. బీరువాలో డబ్బుకే కాదు మెడలో గొలుసుకీ, జేబులో పర్సుకీ, బ్యాంకులో దాచుకున్న సొమ్ముకూ గాలం వేసేవారు మనచుట్టూనే ఉన్నారని హెచ్చరిస్తున్నారు.

cyber crime
cyber crime

By

Published : Jan 17, 2022, 12:28 PM IST

దొంగతనాలు, సైబర్‌ మోసాల ద్వారా నిందితులు తెలంగాణలో గంటకు రూ.రెండున్నర లక్షలు, రోజుకు రూ.అరకోటిపైనే దోచేస్తున్నారు. సైబర్‌ నేరాలన్నింటినీ కలిపి చూస్తే ఈ మొత్తం దీనికి రెట్టింపు ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొలుసు దొంగతనాలు తగ్గినట్లు కనిపిస్తున్నా మామూలు చోరీలు భయపెడుతూనే ఉన్నాయి. ఇక సైబర్‌ నేరాలు ఏటికేడు రెట్టింపవుతున్నాయి. మొత్తంగా అప్రమత్తంగా లేకుంటే.. బీరువాలో డబ్బుకే కాదు మెడలో గొలుసుకీ, జేబులో పర్సుకీ, బ్యాంకులో దాచుకున్న సొమ్ముకూ గాలం వేసేవారు అదృశ్యంగా మనచుట్టూనే ఉన్నారు.. తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పోలీసులు!!

  • గత ఏడాది రాష్ట్రంలో ఆస్తికి సంబంధించిన నేరాల్లో (చోరీలు, దోపిడీలు..) 17,429 కేసులు నమోదయ్యాయి. ఆయా ఘటనల్లో రూ.113.50 కోట్ల సొత్తు నేరగాళ్ల పాలయింది.
  • సైబర్‌ నేరాల్లో.. సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌)కు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం ప్రజలు నష్టపోయిన సొమ్ము విలువ మరో రూ.95.71 కోట్లు. సైబర్‌ నేరాలు పెరిగిపోతుండటంతో బాధితులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థని ఏర్పాటు చేసింది. సైబర్‌ నేరానికి గురైన వారు 155260 నంబరుకు ఫోన్‌ చేస్తే బాధితుల వివరాలు తెలుసుకొని కోల్పోయిన సొత్తు తాలూకూ లావాదేవీని నిలిపివేస్తారు.
  • పై రెండింటి ప్రకారం గతేడాది రాష్ట్ర ప్రజలు కోల్పోయిన మొత్తం రూ.209.21 కోట్లు. అంటే రోజుకు రూ.57.31 లక్షలు పోగొట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది.
  • ఇవికాకుండా.. సైబర్‌ నేరాలపై అనేక మంది సరాసరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు. ముఖ్యంగా బహుమతుల పేరుతో ఆశలు చూపి, పెళ్లి పేరుతో, ఇతరత్రా డబ్బు గుంజేవారికి సంబంధించి.. గత ఏడాది మరో 8,839 కేసులు నమోదయ్యాయి. ఈ నేరాల్లో కోల్పోయిన మొత్తం రూ.300 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.

నగలు, నగదు కొంతమేర స్వాధీనం

  • చోరీ అయిన నగలు, నగదుని పోలీసులు కొంతవరకూ తిరిగి స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. గత ఏడాది ఈ సొత్తులో రూ.53.11 లక్షలు (47 శాతం) తిరిగి రాబట్టగలిగారు.
  • సైబర్‌ నేరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. నిందితులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటుండటంతో వారిని గుర్తించడం, అరెస్టు చేయడం, సొత్తు రాబట్టడం సాధ్యం కావడంలేదు. కొంతమేరకు ఆయా బ్యాంకు లావాదేవీలను నిలిపివేయగలుగుతున్నారు. ఇలా గత ఏడాది రూ.5.11 కోట్ల నగదు లావాదేవీలను నిలుపు చేయగలిగారు. పోగొట్టుకున్న సొమ్ములో ఇది 5 శాతం మాత్రమే. ఇది కూడా బాధితులకు అందేవరకూ గ్యారంటీ లేదు.

ముందు జాగ్రత్తలే ముఖ్యం

కష్టపడి కూడబెట్టిన సొమ్ము చోరులపాలు కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే ముఖ్యమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పోలీస్‌స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని, ఇంట్లో ఎక్కువ నగదు, నగలు ఉంచవద్దని పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా పలువురు దీన్ని పాటించడంలేదు. మాయమాటలతో మోసం చేస్తున్న సైబర్‌ నేరగాళ్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలేవీ ఇతరులతో పంచుకోవద్దని.. గుర్తింపులేని, అపరిచిత వ్యక్తులు పంపే క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:

Vijayawada Crime News: రోజుకో కొత్త తరహా మోసం... నగర వాసుల గుండెల్లో గుబులు !

ABOUT THE AUTHOR

...view details