ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాళ్లు తేలిన దారులు.. నోళ్లు తెరిచిన గుంతలు.. నగర రోడ్లపై నరకయాతన - Andhrapradesh Roads Damaged

రాష్ట్రవ్యాప్తంగా నగర రహదారులు దెబ్బతిన్నాయి. ఎటు చూసినా రాళ్లు తేలిన దారులు.. నోళ్లు తెరిచిన గుంతలే దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్ల వల్ల వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. రాష్ట్రంలో 16 నగరపాలక సంస్థల్లోని పరిస్థితిపై ప్రత్యేక కథనం.

Roads Damaged in Allover Andhrapradesh
నగర రోడ్లపై నరకయాతన

By

Published : Jun 10, 2022, 4:21 AM IST

పల్లె, పట్టణమే కాదు.. నగరాల్లోనూ రహదారులు గుంతలమయమయ్యాయి. తారు, సిమెంటు పోయి వాహనదారుల ఒళ్లు హూనం చేస్తున్నాయి.. తీరూ తెన్నూ లేని రోడ్ల మీద ప్రయాణంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. పెరిగిన పెట్రో ధరలకు ఈ ఖర్చూ కలిసి చేతి చమురు వదులుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కాలనీల్లోని అంతర్గత రోడ్లు, నగరాల్లో విలీనమైన గ్రామాలకు వెళ్లే రోడ్లే కాదు.. అక్కడక్కడా ప్రధాన రహదారులూ అధ్వానంగా మారాయి. సంవత్సరాలు గడుస్తున్నా యంత్రాంగం వాటిని బాగు చేయకపోవడం ప్రజలకు నిత్యం నరకం చూపిస్తోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని కార్పొరేషన్ల పరిధిలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్నం, రాజధాని ప్రాంతంలోని గుంటూరు నగరపాలక సంస్థల్లోనూ చాలా రహదారుల సొగసు ఇదే. సీఎం జగన్‌ ఇలాకా కడపలో శంకుస్థాపన చేసిన రహదారులకూ ఏడాదవుతున్నా అడుగు ముందుకు పడకపోవడమే రోడ్ల నిర్వహణపై ప్రభుత్వ శ్రద్ధకు అద్దం పడుతోంది. రాష్ట్రంలోని 16 నగరపాలక సంస్థల పరిధిలో బాగా దెబ్బతిన్న 19.12 కి.మీ విస్తీర్ణంలోని 16 రహదారులను ‘ఈనాడు’ ప్రతినిధులు ఈ నెల 2 నుంచి 5వ తేదీ మధ్య పరిశీలించారు. కిలోమీటరుకు సగటున 53 గుంతలు తేలిన ఈ రోడ్ల దుస్థితిపై ప్రత్యేక కథనం..

  • పరిశీలించిన నగరపాలక సంస్థలు 16
  • పరిశీలించిన రహదారులు 16
  • పొడవు 19.12 కిలో మీటర్లు
  • కనిపించిన గుంతలు 1,024
  • సగటున కి.మీ.కి గుంతలు 53

ఆస్తి పన్ను పెంపు, కొత్తగా చెత్త పన్ను విధింపు.. ఇలా వీలున్న చోటల్లా ప్రజల దగ్గర నుంచి సొమ్ములు లాగుతున్న ప్రభుత్వం వారికి కనీసం సరైన రోడ్లు కూడా వేయలేకపోతోంది. పల్లెలు, పట్టణాలే అనుకుంటే.. నగర రహదారులూ వాటికి తీసిపోని స్థాయిలో దెబ్బతిన్నాయి. రద్దీ ట్రాఫిక్‌ నుంచి తొందరగా బయటపడి ఇల్లు చేరదామని బండి వేగం పెంచేలోపే.. వాహనదారులు గుంతల్లో పడిపోతున్నారు. ప్రజాప్రతినిధులు నివసించే ప్రాంతాల్లోని రహదారులపై చూపే శ్రద్ధలో పదో వంతు కూడా నగరాల్లోని గుంతల రోడ్లు మరమ్మతులపై పెట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్ల దుస్థితి చూడలేక.. కొన్నిచోట్ల స్థానికులే భవన నిర్మాణ వ్యర్థాలను తెచ్చి గుంతలు పూడుస్తుండటం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో.. చాలాచోట్ల రహదారుల మరమ్మతులకు టెండర్లు వేయడానికీ గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఇప్పుడే రోడ్లు ఇలా ఉంటే వర్షాకాలం ఈ గుంతల రోడ్ల మీద ఇంకెన్ని అవస్థలు పడాలోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి గతేడాది జులై 8న కడప నగరంలో రూ.251 కోట్ల వ్యయంతో రహదారులకు శంకుస్థాపన చేశారు. ఇందులో మాసాపేట- బైపాస్‌ రహదారి అభివృద్ధి పనులను రద్దు చేసి, వరద కాల్వల ఆధునికీకరణకు రూ.69 కోట్లు మళ్లించారు. నిధులు లేకపోవడంతో మిగిలిన మూడు రహదారుల అభివృద్ధికి టెండర్లు కూడా పిలవలేదు.

మచిలీపట్నం నగరంలో హౌసింగ్‌బోర్డులోని రహదారి, పార్క్‌ సమీపంలోని రహదారులు గుంతలు తేలి, ద్విచక్రవాహనదారులు కిందపడి, గాయాలపాలవుతున్నారు.

అనంతపురంలో సోమనాథ్‌నగర్‌, రంగస్వామినగర్‌, శాంతినగర్‌ రోడ్డు ప్రాంతాల్లో గుంతలు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల సోమనాథ్‌నగర్‌ వంతెన వద్ద బైక్‌ అదుపు తప్పి, ఇద్దరు గాయపడ్డారు.

గుంటూరు ఎన్జీవో కాలనీ ఆరో లైను దగ్గర 70 మీటర్ల పొడవున పడిన గుంత చూసి వాహనదారులు హడలిపోతున్నారు. ఈ ప్రాంతంలో గుంతల్లోనే రోడ్డు వెతుక్కోవాల్సిన దుస్థితి. అడుగుపైగా లోతున్న ఈ గుంతలో పడి పాదచారులు, వాహనదారులు గాయాలపాలవుతున్నారు. సిమ్స్‌ మై స్కూల్‌ నుంచి రెడ్డి కాలేజీ వెనక గేటు వరకు గోతులు ఎక్కువే. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ కోసం రోడ్డు తవ్వి వదిలేయడంతో భారీ గోతులు మిగిలాయి. ద్విచక్రవాహనంపై వెళుతూ కిందపడి గాయాలపాలైన ఒక వ్యక్తి.. రోడ్డు దుస్థితి చూడలేక ట్రక్కు మట్టి తోలించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.

నెల్లూరు
తాంబరం వీధిలో రహదారి రాళ్లు తేలాయి. ఫతేఖాన్‌పేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి నడుచుకుంటూ వెళ్తుండగా.. పక్కనే వెళ్తున్న కారు టైరు కింద పడిన రాయి ఎగిరివచ్చి ఆయనకు తగలడంతో గాయాలపాలయ్యారు. భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ కోసం తవ్విన గుంతలను.. పూడ్చకుండా వదిలేశారు. రూ.81.70 కోట్ల బిల్లులు ఆగిపోవడంతో గుత్తేదారు ముందుకు రావడం లేదు.

విశాఖపట్నం
ద్వారకానగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు నుంచి చందు స్వీట్స్‌ వరకు ఉన్న రహదారి.. నగరంలోనే రద్దీ రోడ్లలో ఒకటి. పౌరగ్రంథాలయం సమీపంలో రోడ్డు కుంగిపోయి ఏకంగా అడుగు లోతు గొయ్యి పడింది. గురుద్వారా జంక్షన్‌, శ్రీకృష్ణ విద్యామందిర్‌, పౌరగ్రంథాలయం ప్రాంతాల్లో మరింత దారుణంగా ఉంది. జీవీఎంసీ పరిధిలో మొత్తం 112 కి.మీ.ల మేర రోడ్లు మరమ్మతులు చేయాల్సి ఉంది.

చిత్తూరు
చెంగల్రాయమిట్ట సమీపంలో 5.30 మీటర్ల పొడవైన గుంత ఉంది. కట్టమంచి ప్రారంభంలో, చెంగల్రాయమిట్ట, మైదా కర్మాగారం, సీకేపల్లి సమీపంలో గుంతలు ఎక్కువగా ఉన్నాయి. భారీ వాహనాలు చిత్తూరు నగరం లోపలకు రాకుండా వెళ్లాలంటే కట్టమంచి- మైదా కర్మాగారం రోడ్డే దిక్కు. 2.35 కి.మీ. ఈ రహదారి వర్షం వస్తే అధ్వానంగా తయారవుతుంది.

రాజధానిలో కీలకమైన విజయవాడలో కొన్ని చోట్ల రోడ్ల దుస్థితి నరకాన్ని తలపిస్తోంది. తిరుమల ఆర్థో డెంటల్‌ కేర్‌ ఎదురు రహదారిలో ద్విచక్రవాహనాలపై వెళ్తూ పడి గాయాలపాలైన సంఘటనలున్నాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లోనే పలుచోట్ల డ్రైనేజి మూతలు లోతుల్లో ఉన్నాయి. వేగంగా వెళ్లే వాహనం అక్కడికి రాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనవుతోంది. మరమ్మతులకు నిధుల కొరత కారణంగా చూపిస్తున్నారు.

కర్నూలు
కర్నూలులో సుంకేసుల రోడ్డు నుంచి హైదరాబాద్‌ హైవే సంతోష్‌నగర్‌కు కలిపే రహదారి పంచాయతీగా ఉన్నప్పుడు వేశారు. విలీనం తర్వాత మరమ్మతులు చేసిందే లేదు. అక్కడ 2 కి.మీ. రోడ్డు విస్తరణ, రహదారి నిర్మాణానికి రూ.1.29 కోట్లు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదు. కెనరా బ్యాంకు ఎదురుగా 90 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పున రహదారి భారీగా దెబ్బతింది.

ఒంగోలు

ఒంగోలులో కిమ్స్‌ ఆస్పత్రికి సమీపంలో సాగర్‌ కాలువ వద్ద 10 సెం.మీ.లోతు, 15 మీటర్ల పొడవుతో పక్కపక్కనే 3గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో 12 డివిజన్లలో ఎవరూ టెండరు వేయలేదు. పనులు చేయాలని ఇంజినీర్లు, కార్పొరేటర్లు గుత్తేదార్లను బతిమాలుకుంటున్నారు. సమతానగర్‌, మంగమూరురోడ్డులోని కాలనీలు, రాజీవ్‌ గృహకల్ప, ఇందిరాకాలనీ, కేశవరాజుకుంట ప్రాంతాల్లోని 38 రోడ్లలో క్వారీల నుంచి వచ్చే రజను పరిచారు.

పెండింగ్‌ బిల్లులు రూ.650 కోట్లు

నగరపాలక సంస్థల్లో పనులంటే గతంలో గుత్తేదారులు పోటీపడి టెండర్లు వేసేవారు. అలాంటిది మూడేళ్లుగా నగరాల్లో పనులంటే గుత్తేదారులు కన్నెత్తి చూడటం లేదు. ఒకే పనులకు రెండు, మూడుసార్లు టెండర్లు పిలుస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. పూర్తి చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే ఈ పరిస్థితికి కారణం. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు రెండేళ్ల తరువాత బిల్లులు చెల్లించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పనుల బిల్లులు ఇప్పటికీ చాలా మున్సిపాలిటీల్లో పెండింగే. గత మూడేళ్లలో వివిధ పద్దుల కింద పూర్తి చేసిన పనులకు రాష్ట్రవ్యాప్తంగా రూ.650 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. అత్యధికంగా మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో సుమారు రూ.120 కోట్లు, విజయవాడ నగరపాలక సంస్థలో రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఖాతాల్లో నిధులున్నా.. ఏం లాభం?

మూల ధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధింపు విధానం అమలులోకి వచ్చాక పుర, నగరపాలక సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ఆస్తి పన్ను ఏటా 15% చొప్పున గత రెండేళ్లుగా పెంచుతున్నారు. వీటితో రహదారులు, కాలువలు మరమ్మతులు చేయడం, వీధి దీపాలు, తాగునీటిపరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. పట్టణ స్థానిక సంస్థల ఖాతాలను ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కి అనుసంధానించాక బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో అధికారులు రోడ్ల పనుల ఊసెత్తడం లేదు. వారు చొరవ తీసుకున్నా టెండర్లు వేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. సీఎఫ్‌ఎంఎస్‌కి ముందు పూర్తయిన పనులకు నగరపాలక సంస్థ కమిషనర్లే బిల్లులు చెల్లించేవారు. ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేసి, ఆర్థికశాఖ దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తున్నారు.

తరచూ ప్రమాదాలు

రహదారులపై గోతులు పెద్దవిగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్రవాహన చోదకుడొకరు గోతిలో పడి కాలికి గాయమవడంతో ..మరొకరికి ఇలా జరగకూడదని ఆయనే మట్టి తెప్పించి పూడ్పించారు. ప్రజలకున్న స్పృహ అధికారులకు ఉండటం లేదు.

- రంగయ్య స్వామి, ఎన్జీవో కాలనీ, గుంటూరు

మూడేళ్లయినా పట్టించుకున్న వారే లేరు

రహదారులు దెబ్బతిని మూడేళ్లవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వానాకాలంలో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. కుటుంబసభ్యులతో వాహనంపై వెళ్తూ జారిపడినా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాం.

-జి.గోవింద్‌, స్థానికుడు, మచిలీపట్నం

ABOUT THE AUTHOR

...view details