ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారీ వర్షాలతో రోడ్లు చిన్నాభిన్నం...ప్రయాణం నరకప్రాయం - Roads damaged by heavy rains in AP

భారీ వర్షాలతో రాష్ట్రంలోని రహదారులు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలు సాగించడానికి వీలులేని దుస్థితికి చేరాయి. ప్రయాణం నరకప్రాయంగా మారింది. రెండేళ్లుగా నిర్వహణ పనులు చేపట్టలేదు. వాహనచోదకులు రోడ్లపైకి రావాలంటేనే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.

Roads damaged by heavy rains in AP
ఏపీలో భారీ వర్షాలతో రోడ్లు చిన్నాభిన్నం

By

Published : Oct 21, 2020, 7:23 AM IST

రాష్ట్రంలో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరాయి. ఆయా మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులు అనే తేడా లేకుండా అన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీలో గత రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. ఏటా నిర్వహణ పనులను గాలికొదిలేశారు. దీనికి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలు తోడవడంతో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. దాంతో వాహన చోదకుల బాధలు వర్ణనాతీతం. రహదారులపైకి రావాలంటేనే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు 4,600 కి.మీ. దెబ్బతిన్నాయి. వీటిలో రాష్ట్ర రహదారులు 1,400 కి.మీ కాగా...జిల్లా ప్రధాన రహదారులు 3,200 కి.మీ.గా ఉన్నాయి. వీటిలో తక్షణమే గుంతలు పూడ్చడానికి, ఇతర తాత్కాలిక మరమ్మతులకు రూ.230 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.2,630 కోట్ల మేరకు వ్యయమవుతుందని అంచనా వేశారు.

రాష్ట్రంలో జిల్లా ప్రధాన రహదారులు 32,711 కి.మీ.లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి నిర్వహణకు కేటాయించిన నిధులు అక్షరాలా రూ.15 కోట్లు. వీటిలో ఎన్ని కి.మీ.లు మరమ్మతులు చేస్తారు? ఎంత మేరకు నిర్వహణ పనులు చేస్తారు? గుత్తేదారులకు బకాయిలు ఎంత చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర రహదారుల్లో కూడా మరమ్మతులు, నిర్వహణ పనులకు రూ.150 కోట్లు కేటాయించారు. చేయాల్సిన పనులకు ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు.

గుత్తేదారులు వెనకడుగు

ఆర్‌అండ్‌బీలో మరమ్మతు పనులు చేయాలంటేనే గుత్తేదారులు ఆమడదూరంలో ఉంటున్నారు. రెండేళ్లుగా చెల్లింపులు లేకపోవడంతో వారు ఆసక్తి చూపడం లేదు. గతంలో చేపట్టిన మరమ్మతు పనులకు జిల్లా ప్రధాన రహదారుల్లో దాదాపు రూ.200 కోట్లు, రాష్ట్ర రహదారుల్లో రూ.150 కోట్ల మేర బకాయిలున్నాయి. మధ్యలో ఆగిపోయిన వివిధ రహదారుల ప్రాజెక్టుల విలువకూడా రూ.700 కోట్లపైగానే ఉంది. ఇప్పుడు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేసినా..బిల్లులు ఇవ్వరనే ఉద్దేశంతో పలువురు గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు.

నిర్వహణ వదిలేశారు..

ఐదేళ్లకు ఓసారి రహదారుల పైలేయర్‌ను మళ్లీ వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర, జిల్లా రహదారులు కలిపి 46,211 కి.మీ. ఉండగా...వీటిలో దాదాపు 9,250 కి.మీ. చొప్పున ఏటా మరమ్మతులు చేయాలి. గత కొన్నేళ్లుగా ఇవి జరగడం లేదు. 2019-20లో కేవలం 800 కి.మీ.ల పనులను మాత్రమే చేశారు. ప్రస్తుత 2020-21లో ఇప్పటివరకు ఒక్క కి.మీ.కు కూడా చేయలేదు..

అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 980 కి.మీ.లు, కర్నూలులో 700 కి.మీ., తూర్పుగోదావరి జిల్లాలో 675 కి.మీ.లు, కడపలో 450 కి.మీ., శ్రీకాకుళంలో 445 కి.మీ.లు, కృష్ణాలో 440 కి.మీ, గుంటూరులో 325 కి.మీ.లు చొప్పున ధ్వంసమయ్యాయి.

ఇదీ చదవండి:

కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి- కిలోకు రూ.100కుపైనే..

ABOUT THE AUTHOR

...view details