ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

No Transport : పచ్చి బాలింత.. పది కిలోమీటర్లు నడిచి.. - ఆసిఫాబాద్‌లో రవాణ సమస్యలు

బిడ్డను కనడం అంటే తల్లి మరో జన్మ ఎత్తడం. నవమాసాలు మోయడం ఒక ఎత్తైతే.. ప్రసవించడం మరో ఎత్తు. ఇక ఆ ప్రసవం సాధారణ కాన్పు కాకుండా.. సిజేరియన్ అయితే ఇంకా నరకం. నెలల తరబడి మంచానికే పరిమితం అవుతారు. అలా ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. పచ్చిబాలింతగా ఉండగానే పది కిలోమీటర్లు నడిచింది. అసలు ఆమె అలా ఎందుకు నడవాల్సి వచ్చిందంటే..

No Transport in Asifabad
No Transport in Asifabad

By

Published : Apr 29, 2022, 5:07 PM IST

No Transport in Asifabad :తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో మిగతా జిల్లాలో పోలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎప్పుడు కాస్త వెనకబడే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నం. చాలా ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా వానవట్ పంచాయతీకి అనుబంధ గ్రామమైన మాంగ్లీలో రోడ్డు సౌకర్యం లేక.. పెళ్లి మండపానికి ఓ యువతి ఎడ్లబండిలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

No Transport in Komurambheem Asifabad : రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పచ్చి బాలింత పది కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్న ఘటన ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన నాయకపుగూడ గ్రామంలో చోటుచేసుకుంది. గోవెన నాయకపుగూడ గ్రామానికి చెందిన నాగమ్మ- పరమేశ్‌ దంపతులకు రెండో సంతానంగా అమ్మాయి జన్మించింది. ప్రసవం కోసం నాగమ్మ నిర్మల్‌ జిల్లాలోని పుట్టింటికి వెళ్లగా అయిదురోజుల క్రితం ఆడపిల్ల జన్మించింది.

అనంతరం గురువారం ప్రత్యేక వాహనంలో నిర్మల్‌ నుంచి ఆసిఫాబాద్‌ వరకు, ఇక్కడి నుంచి బలాన్‌పూర్‌ వరకు వచ్చారు. బలాన్‌పూర్‌ నుంచి గోవెన నాయకపుగూడ పది కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో రెండు చిన్నపాటి కొండలు, వాగులు దాటాలి. గతేడాది ‘పోలీసులు- మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన దారి వర్షాలకు కోతకు గురై అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనమే అతికష్టం మీద వెళ్తుంది. ఈ నేపథ్యంలో బాలింత నాగమ్మ గురువారం దగ్గరి బంధువు సాయంతో పది కిలోమీటర్లు నడిచి మెట్టినింటికి చేరారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details