సచివాలయం వేదికగా తొలిసారి జరిగిన రాష్ట్రస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా జాతీయ రహదారుల అథారిటీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. గత ఐదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల గణాంకాలను విశ్లేషించారు. రోడ్లపై ఇంజినీరింగ్ లోపాలతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు నిర్థరించారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లపై ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే రహదారి భద్రతా నిబంధనలు కఠినంగా అమలుచేయాలని నిశ్చయించారు. వాహనదారులకు తగిన అవగాహన కల్పించాలని, పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు జరిమానాల విధింపు సహా మార్పు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పోలీసు, రవాణాశాఖ అధికారులను కోరుతూ తీర్మానం చేశారు.
"రహదారి భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేద్ధాం" - traffic rules
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి రహదారి భద్రతా కమిటీ నిర్ణయించింది. రోడ్లపై ఇంజినీరింగ్ లోపాలు సరిదిద్దటం, వాహనదారులకు అవగాహం కల్పించటం, రహదారి నిబంధనలు కఠినంగా అమలు చేయటం సహా 12 అంశాలపై చర్చించింది.
ప్రమాదానికి తావు లేకుండా
ప్రమాదాల నివారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచాలన్న నిర్ణయం మేరకు బడ్జెట్‌లో కేటాయించిన 50 కోట్ల నిధులతో ఆధునిక పరికరాలు కొనుగోలు చేయనున్నారు. వేగ నియంత్రణకు వీలుగా రహదారులపై స్పీడ్ గన్‌లు ఏర్పాటుచేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను గుర్తించే పరికరాలు కొనుగోలు చేసి తనిఖీలు చేయనున్నారు. మలుపులు, స్పీడ్ బ్రేకర్లు, వంతెనలు, కల్వర్టులు ఉన్నచోట హెచ్చరిక బోర్డులు తప్పక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడు నెలలకోసారి తప్పక సమావేశం నిర్వహించి అమలుచేస్తున్న విధానాలను సమీక్షించనున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై చర్చించనున్నారు