తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు కారులో ప్రయాణిస్తుండగా.. మూడేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి - నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
కారు బోల్తా పడటంతో నలుగురు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్ బడంగ్‌పేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చికిత్స నిమిత్తం రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో ఎల్లయ్య, గోవిందమ్మ, రాధిక, శారద ఉండగా.. డ్రైవర్ వినోద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడు శర్విక్ పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. ఎడమవైపున ఉన్న గుంతను తప్పించేందుకు కుడివైపునకు కారు తిప్పగా.. పల్టీలు కొట్టి ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లకు సీఎం శంకుస్థాపన