road accident blackspots in ts: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత మూడేళ్లలో అత్యధిక రోడ్డుప్రమాద మరణాలు వరుసగా పటాన్చెరు ఠాణా పరిధిలోనే జరిగాయి. 2018లో 62, 2019లో 64, 2020లో 50 మంది చనిపోయారు. అక్కడి బ్లాక్స్పాట్లలో జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలులోపాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్స్పాట్లపై అధ్యయనానికి కలెక్టర్ల అధ్యక్షతన 3-6 నెలలకోసారి జరిగే సమీక్షల్లో ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలుగా విభజించగా.. అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 21 బ్లాక్స్పాట్లలో సమస్యల పరిష్కారానికి ఎన్హెచ్ఏఐకి ప్రతిపాదనలు పంపారు. కట్టంగూరు-కుడుమర్తి, ఆకుపాముల బైపాస్, కోదాడ కటికమ్మగూడెంలలో సర్వీసురోడ్ల నిర్మాణం.. చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్, సూర్యాపేట టేకుమట్లల్లో వెహిక్యులర్ అండర్‌బ్రిడ్జిల నిర్మాణం వీటిల్లో కొన్ని.. అలాగే హైదరాబాద్-నాగ్‌పుర్ జాతీయ రహదారిపై మేడ్చల్ పట్టణంలో సర్వీస్‌రోడ్డుతో పాటు పటిష్ఠమైన డివైడర్ల ఏర్పాటు ప్రతిపాదనలూ ఉన్నాయి. ఇవి కార్యరూపం దాల్చడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్స్పాట్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
ఏవి బ్లాక్‌స్పాట్‌లంటే..
* రహదారిలో 500 మీటర్ల పరిధిలోని స్ట్రెచ్‌లో ఏటా 5 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాదాలు లేదా మరణాలు సంభవిస్తే బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తున్నారు.
* ఏడాదిలో 20లేదా అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగితే ‘ఎ’ కేటగిరీ, 10-19 ప్రమాదాలు జరిగితే ‘బి’ కేటగిరీ, 5-9 ప్రమాదాలు సంభవిస్తే ‘సి’ కేటగిరీ బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తున్నారు.
ముత్తంగి కూడలి.. ఆక్రమణలే అడ్డంకి
ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న ముత్తంగి కూడలి నిత్యం రద్దీగా ఉంటుంది. పలు రాష్ట్రాల నుంచి పటాన్చెరు, పాశమైలారం, జిన్నారం, ఖాజిపల్లి, జహీరాబాద్ నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతాలకు నిత్యం వేలకొద్దీ భారీ వాహనాలు ఓఆర్ఆర్పై రాకపోకలు సాగిస్తాయి. అలాంటి కూడలిలోనే ఆక్రమణలు కళ్లకు కడుతున్నాయి. జాతీయ రహదారికి ఇటుపక్క ఒక లాడ్జి, మరోవైపు హోటల్ ఉన్నాయి. ఈ రెండింటి ఎదుట వాహనాలను రోడ్డుపైనే నిలిపి ఉంచుతుండటంతో ఓఆర్ఆర్పైకి రాకపోకలతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఓఆర్ఆర్కు దారితీసే సర్వీస్‌రోడ్డు వెంబడే లారీలను నిలిపి ఉంచుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడేళ్లలో 30 ప్రాణాంతక ప్రమాదాల్లో 20 మంది చనిపోయారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జహీరాబాద్ పర్యటన దృష్ట్యా పోలీసులు రహదారిపై వాహనాలను సరిదిద్దుతూ కనిపించారు.