మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. నిన్న ఉదయం 6గంటలకు ఆర్కే కన్నుమూసినట్టు వెల్లడించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్కే.. డయాలసిస్ జరుగుతుండగా ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు.
‘‘ఆర్కే మృతి మా పార్టీకి తీరని లోటు. 1978లో ఆయన పీపుల్స్ వార్ సభ్యత్వం తీసుకున్నారు. 1982 నుంచి పూర్తికాలం కార్యకర్తగా వచ్చారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా.. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు. చర్చల తర్వాత ఆర్కే హత్యకు ప్రయత్నాలు జరిగాయి. 2004 నుంచి పదేళ్ల పాటు ఏవోబీ కార్యదర్శిగా కొనసాగారు. అలాగే, 2018లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరోలో ఆర్కేకు స్థానం లభించింది. 2018లో ఆర్కే కుమారుడు మున్నా మృతి చెందారు ’’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనలో పేర్కొంది.
ప్రజల కోసమే అమరుడయ్యాడు..:కల్యాణరావు
ఆర్కే మరణంపై విరసం నేత కల్యాణరావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ అధికారిక ప్రకటనతో ఆయన బోరున విలపించారు. ‘‘ఆర్కే ప్రజల హృదయాల్లో ఉంటారు. ఆయన ప్రజల కోసం అమరుడయ్యారు. పోలీసులు వైద్యం అందకుండా చేశారు. వైద్యంఅందకుండా పోలీసులను మోహరించారు. ఆర్కే విప్లవకారుడిగా జీవించారు.. విప్లవకారుడిగానే మరణించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం’’ అన్నారు.