ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ(ఆర్డీసీ) బలోపేతం, రహదారుల పనులకు నిధులు సమకూర్చుకోవడం పేరిట ప్రభుత్వం టోల్ వసూలుకు దిగనున్నారు. మొత్తంగా 35 రహదారులను ఎంపిక చేయగా, వీటిపై వాహనాల రద్దీ రోజుకు 6 వేల నుంచి 12 వేల పీసీయూలు (పాసింజర్ కార్ యూనిట్లు) వరకు ఉంది.
తొలుత రెండేళ్లు... తర్వాత పదేళ్లు
టోల్ వసూలుకు తొలుత 11 రహదారులను ఎంపిక చేశారు. వీటిలో ప్రస్తుతం అంతగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, దాదాపు బాగున్నవే ఉన్నాయి. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేస్తారు. ఈ రోడ్లపై రెండేళ్లలో రూ.217.40 కోట్ల రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఏకంగా పదేళ్లపాటు గుత్తేదారులకు టోల్ బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. మరోవైపు రెండో దశలో కొంత మరమ్మతులు చేయాల్సిన రోడ్లను మూడో దశలో కొంతమేర విస్తరణ, అభివృద్ధి చేయాల్సిన రోడ్లను ఎంపిక చేశారు.