Fine Rice Prices: రాష్ట్రంలో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. క్వింటాలు సన్న బియ్యం ధర రూ.5,200కి చేరింది. వారం వ్యవధిలోనే క్వింటాలుకు రూ.500 వరకు ఎగిసింది. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధాన్యం ధరలు పెరగడమే దీనికి కారణమని మిల్లర్లు పేర్కొంటున్నా.. వాస్తవానికి ఈ రకాల ధాన్యం రైతుల వద్ద ఇప్పుడు 10% నుంచి 20% కూడా లేదు. పంట చేతికి రాగానే అధిక శాతం రైతులు అమ్మేశారు. దీంతో అవన్నీ మిల్లర్ల వద్దకు చేరాయి. అక్కడ నుంచే ధరలు పెరగడం మొదలైంది. దీంతో అధిక ప్రయోజనం వ్యాపారులకే అందుతోంది. పెరిగిన ధరలతో పోలిస్తే రైతులు ఎకరాకు రూ.27 వేల వరకు నష్టపోయారు.
రాష్ట్రంలో 125 లక్షల టన్నుల ఉత్పత్తి
రాష్ట్రంలో గడిచిన ఖరీఫ్, రబీ పంట కాలాల్లో 60.30 లక్షల ఎకరాల్లో వరి పండించారు. మొత్తం 125.24 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఖరీఫ్‌లో 40 లక్షలు, రబీలో 27 లక్షలు కలిపి మొత్తంగా 67 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. రైతుల వద్ద మిగిలిన నిల్వల్లో సన్నబియ్యం రకాలను మిల్లర్లు, వ్యాపారులు కొంటున్నారు.
అప్పుడు రూ.1,200.. ఇప్పుడు రూ.2,200
ఖరీఫ్‌లో వర్షాలు అధికంగా ఉండటంతో ఈ ఏడాది పలుచోట్ల ధాన్యం దిగుబడులు పడిపోయాయి. వచ్చిన ధాన్యాన్ని కూడా రైతులు డిసెంబరులోనే అమ్మేశారు. రబీ ధాన్యం మార్చి, ఏప్రిల్‌లో ఇళ్లకు చేరింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు.. వడ్డీలు పెరుగుతుండటంతో వెంటనే విక్రయించారు. కొందరు ఇళ్లలో నిల్వ చేసే అవకాశం లేక అమ్ముకున్నారు.సన్నరకాలకు అప్పట్లో బస్తా (75 కిలోల)కు రైతుకు రూ.1,200 నుంచి రూ.1,400 మాత్రమే దక్కింది. మొత్తం ధాన్యంలో 80% వరకు వ్యాపారుల వద్దకు చేరాక ధరల్లో పెరుగుదల మొదలైంది. ప్రస్తుతం నెల్లూరు సన్నాల ధర బస్తా రూ.2000-2,200కు చేరింది. బీపీటీ రకం కూడా 2,050-2,100 అయింది. బస్తాకు సగటున రూ.900 వరకు పెరిగింది. ఎకరాకు 30 బస్తాల దిగుబడి లెక్కన చూస్తే రూ.27 వేల మేర రైతులు నష్టపోయారు.