కొత్త జిల్లాకేంద్రాల్లో స్థలాలపై ఛార్జీల వడ్డన.. రేపటి నుంచి అమల్లోకి - కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ ధరలు సవరణ వార్తలు
భూముల మార్కెట్ ధరలు సవరణ
By
Published : Apr 4, 2022, 5:04 PM IST
|
Updated : Apr 5, 2022, 4:42 AM IST
17:02 April 04
భూముల మార్కెట్ ధరలు సవరణ
Land Registration charges Hike at New Districts: కొత్త జిల్లాలు ఏర్పడిన కొద్ది గంటల్లోనే మార్కెట్ విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డనకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త జిల్లాల కార్యకలాపాలు అధికారికంగా సోమవారం ఉదయం ప్రారంభం కాగా.. మధ్యాహ్నానికి కొన్ని జిల్లాకేంద్రాలు, శివార్లలో మార్కెట్ విలువల పెంపునకు ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 11 కొత్త జిల్లాకేంద్రాల్లో మార్కెట్ విలువల పెంపు బుధవారంనుంచి అమలుకానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో స్థిరాస్తి రంగం పుంజుకుంటుందన్న ఉద్దేశంతో రెవెన్యూ శాఖ ఈ చర్యలు తీసుకుంది. దీనివల్ల కొనుగోలుదారులపై ఆర్థిక భారం పెరగనుంది.
రేణిగుంటలో అనూహ్యంగా 432% పెంపు!:తిరుపతి కొత్త జిల్లాలోని రేణిగుంట పరిధిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. పారిశ్రామికవాడ రేణిగుంట మండలం అనగుంటలో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ.7.52 లక్షలు ఉండగా.. తాజాగా రూ.40 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదించారు. అంటే ఏకంగా 432 శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రగుంట పరిధిలో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ.9.01 లక్షలుండగా.. ఇప్పుడు రూ.50 లక్షలకు ప్రతిపాదించారు. ఏకంగా 455 శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త జిల్లాకేంద్రం అనకాపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20-40% మధ్య మార్కెట్ విలువల పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు.
విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాకేంద్రం చుట్టుపక్కల 15% వరకు పెంపు ఉండనుంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకేంద్రాల్లో 20-25% వరకు మార్కెట్ విలువల పెంపునకు తగ్గట్టు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పలుచోట్ల ఇంతకంటే ఎక్కువ మొత్తంతో మార్కెట్ విలువలు ప్రతిపాదించారు. దాదాపు ఇవే అమల్లోకి వచ్చే అవకాశముంది. జిల్లాస్థాయిలోనే అధికారిక నిర్ణయాలు జరుగుతాయి. కొత్త జిల్లాల ఏర్పాటును అవకాశంగా తీసుకుని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కొద్దిరోజుల కిందటే మార్కెట్ విలువల (స్పెషల్ రివిజన్)ను జిల్లా అధికారుల ద్వారా ప్రతిపాదించి అమలుకు నిరీక్షిస్తోంది. ఈ ఆదేశాలను సోమవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ్ జారీ చేశారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ వి.రామకృష్ణ జిల్లా అధికారులకు ఉత్తర్వులిచ్చారు.
కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో బాపట్ల, నరసరావుపేట జిల్లాకేంద్రాలు, సమీప 20 గ్రామాల్లో ఫిబ్రవరి1నుంచే మార్కెట్ విలువల పెంపు అమల్లోకి వచ్చింది. నరసరావుపేటకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో వంద శాతం వరకు విలువలు పెరిగాయి. రావిపాడు మినహా మిగిలిన గ్రామాల్లో గజం రూ.1,800 నుంచి రూ.3వేలు చేశారు. రావిపాడులో గజం ధర రూ.1,800 నుంచి రూ.5వేలకు పెరిగింది. ఈస్ట్ బాపట్ల, వెస్ట్ బాపట్ల, అప్పికట్ల, మరుప్రోలువారిపాలెం, ఈతేరు, మురుకొండపాడు, గణపవరం, కర్రపాలెం, మరోచోట మార్కెట్ విలువలను పెంచారు. పట్టణంలో గజం మార్కెట్ విలువ రూ.2,100నుంచి రూ.3,000 చేశారు. కొన్నిచోట్ల ఎకరా మార్కెట్ విలువ రూ.5.25 లక్షలుంటే రూ.7లక్షలుగా ఖరారు చేశారు.
తెనాలి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోనూ సవరించారు. వీటివల్ల ఆస్తుల కొనుగోలుదారులపై రిజిస్ట్రేషన్లపరంగా ఎకరాకు రూ.30వేలనుంచి రూ.50వేల భారం పెరగనుంది. వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలూ పెరిగాయి. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో 25%, చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 35% మేర పెంచేందుకు సిద్ధమవుతున్నారు. మిగిలిన కొత్త జిల్లాకేంద్రాలు, వాటి సమీప గ్రామాల్లో మార్కెట్ విలువల పెంపునకు వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఫీజులు ఖరారవుతున్నాయి.
స్పష్టత ఇస్తారా?:కొవిడ్ కారణంగా మార్కెట్ విలువల సవరింపును వాయిదా వేస్తున్నట్లు గతేడాది జులై 9న ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడున్న మార్కెట్ విలువలు 2022 మార్చి 31 వరకు కొనసాగుతాయని అదే రోజున వెల్లడించింది. ఈ గడువు 5రోజుల కిందట ముగిసింది. తాజాగా ప్రభుత్వ వైఖరిపై స్పష్టత రావాల్సి ఉంది.