పులిచింతల ప్రాజెక్టులో గేటు కొట్టుకుపోయి విలువైన నీరు వృథా కావడానికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్టు నిర్వహణ లోపమేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. చాలాకాలంగా ప్రాజెక్టులో నిర్వహణ పనులను చేపట్టకపోవడంతోపాటు, నిర్మాణ లోపాలూ ఈ ఘటనకు దారితీశాయనే అభిప్రాయానికి కమిటీ వచ్చినట్లు సమాచారం. దాదాపు 44 టీఎంసీల నీటితో నిండుకుండలా ఉన్న పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు ఆగస్టు 5 తెల్లవారుజామున కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుల చరిత్రలో ఇలాంటివి అసాధారణమే. ఇందుకు కారణాలు తెలుసుకునేందుకు, పరిష్కార మార్గాలు చూపేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. జల వనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో పలువురు ప్రస్తుత, విశ్రాంత నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. వీరు పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. తర్వాత అంతర్గతంగా సమావేశమై అనేక విషయాలు చర్చించారు. ఈ ఘటనకు కారణాలపై నివేదిక సిద్ధం చేయాల్సి ఉంది.
*16వ నంబరు గేటులో టై ప్లాట్స్ పూర్తిగా తెగిపోయాయి. అక్కడ గేటును ఎత్తేందుకు, దించేందుకు ఉపయోగించే తాళ్లు తెగిపోయాయని గుర్తించారు. వీటిలో వినియోగించే బోల్టులు విరిగిపోయాయి. వాటిలో ఉండే పుల్లీస్ పడిపోయాయి. గేటు దాదాపు 750 మీటర్ల దూరం కొట్టుకుపోయింది.
*ప్రాజెక్టులో నిర్వహణ లోపాలు ఎక్కువగా ఉన్నాయని, ఘటనకు ప్రధాన కారణం ఇదే కావచ్చని అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండేళ్లుగా గేట్ల నిర్వహణ, సాధారణ అంశాలను సరిగా పట్టించుకోలేదని నిపుణులు భావిస్తున్నారు.
*గ్రీజు వినియోగించలేదు. తలుపులు ఎలా పనిచేస్తున్నాయో తనిఖీ చేసుకోలేదు. నిధులు రాకపోవడంవల్ల నిర్వహణ పనులను సరిగా చేయలేదని అక్కడి ఇంజినీర్లు చెబుతున్నట్లు సమాచారం.
*గేటులో యాంకర్ గడ్డర్, ట్రునియన్ గడ్డర్ ఉంటాయి. ట్రునియన్ గడ్డర్ దిగువ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కట్టడానికి వినియోగించిన కాంక్రీటు గట్టిదనంపైనా నిపుణుల కమిటీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్కడ ఎం.35 కాంక్రీటు వినియోగించాలి. ట్రునియన్ చైర్‌ను నిలబెట్టేచోట వినియోగించిన కాంక్రీటు ప్రమాణాల మేరకు లేకపోవడంతో.. అక్కడ తగిన సామర్థ్యం లేకుండా పోయిందని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది.
*అబ్లాంగ్‌హోల్డ్స్ గేటు తెరిచేటప్పుడు కొంత కదలిక ఏర్పడుతుంది. అక్కడ ఆ కదలిక లేకపోవడంవల్ల ఒత్తిడి (ఫిక్షన్ ఫోర్సు) పెరిగిపోయి ఈ ఘటన జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్కడ నిర్మాణ, నిర్వహణ లోపాలు కనిపించినట్లు తెలిసింది.