ap Revenue divisions: కొత్త జిల్లాల ఏర్పాటుపై అందిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పలు మార్పుచేర్పులు చేసింది. 26 జిల్లాలనే కొనసాగిస్తోంది. అదనంగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది. కొత్తగా ఏర్పాటయ్యే 24 రెవెన్యూ డివిజన్లతో వీటి సంఖ్య 73కు చేరనుంది. ఒక అసెంబ్లీ స్థానాన్ని ఒకే జిల్లాలో కొనసాగించాలనే నిబంధనను పక్కనపెట్టి ప్రజాప్రతినిధుల సూచనల మేరకు రెండు జిల్లాల్లోకి తెచ్చింది.
* అత్యధికంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో 4 రెవెన్యూ డివిజన్ల చొప్పున ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో 3 కొత్తగా ఏర్పాటైనవే. 6 మండలాలతో కుప్పం, 7 మండలాలతో నగరి, 8 మండలాలతో పలమనేరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేశారు. కృష్ణా జిల్లాలో ఉయ్యూరు, పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి.. శ్రీకాకుళం జిల్లాలో పలాస, కోనసీమ జిల్లాలో కొత్తపేట, పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, నందిగామ.. బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల.. ప్రకాశం జిల్లాలో కనిగిరి, కర్నూలు జిల్లాలో పత్తికొండ, నంద్యాల జిల్లాలో డోన్, ఆత్మకూరు..అనంతపురం జిల్లాలో గుంతకల్లు, సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరం.. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి డివిజన్లను ఏర్పాటుచేశారు.
ఒకే నియోజకవర్గం.. రెండు జిల్లాల్లోకి..
* అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలిపారు. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలను రాజమహేంద్రవరం జిల్లాలో కొనసాగించారు. జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలోకి తెచ్చారు. ఈ నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాలు కాకినాడ జిల్లాలో ఉంచారు.
* తొలుత విడుదలైన నోటిఫికేషన్‌లో నగరి నియోజకవర్గంలో 5 మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. తాజాగా నగరి, నిండ్ర, విజయపురం మండలాలను చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తూ.. వడమాలపేట, పుత్తూరును తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తెచ్చారు.
* చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలు గతంలో తిరుపతి జిల్లాలో చేర్చారు. తాజాగా పాకాల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్లో చేర్చారు. చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చినగొట్టిగల్లును తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించారు.
* నంద్యాల లోక్‌సభ పరిధిలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలిపారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 మండలాలను కర్నూలు జిల్లాలోనే ఉంచుతూ జనవరి 26న నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా ఇందులో పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలోకి తెచ్చారు. నంద్యాల జిల్లాలో కొనసాగించాలనే విన్నపాలు వచ్చాయి. కర్నూలులో భాగంగాఉండే కల్లూరుతోపాటు సమీపంలోనే ఉండే ఓర్వకల్లు మండలాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగిస్తున్నారు.
* రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలను తొలుత అన్నమయ్య జిల్లాలోకి చేర్చారు. తాజాగా ఇందులోని సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోకి (కడప రెవెన్యూ డివిజన్)లోకి మార్చారు. రాజంపేట, నందలూరు, చుండుపల్లె, వీరబల్లి మండలాలను అన్నమయ్య జిల్లాలోనే (రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో) కొనసాగించారు.
* కందుకూరు రెవెన్యూ డివిజన్‌ను కొనసాగించారు. నెల్లూరు జిల్లా కావలి డివిజన్‌లోని వరికుంటపాడు, కొండాపూర్ మండలాలను ఇందులో చేర్చారు.
* వెంకటగిరి నియోజకవర్గంలోని 6 మండలాలను తొలుత తిరుపతి జిల్లాలో చేర్చారు. తాజాగా ఇందులో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలో కలిపారు.
* విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలు తొలుత మన్యం జిల్లా పరిధిలో చేర్చారు. తాజాగా మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోకి తెచ్చారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలను పార్వతీపురం మన్యం జిల్లాలో కొనసాగిస్తున్నారు. మెంటాడ మండలాన్ని విజయనగరంలోనే కొనసాగించాలన్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని గంగువారిసిగడ మండలాన్ని విజయనగరం జిల్లాలోకి చేర్చారు.
* ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని 4మండలాలను తొలుత శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచారు. తాజాగా ఇందులోని గంగువారిసిగడ మండలాన్ని విజయనగరం జిల్లాలోకి (చీపురుపల్లి రెవెన్యూ డివిజన్) చేర్చారు. ఎచ్చర్ల, రణస్థలం, లావేరు మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే (శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్)లో కొనసాగనున్నాయి.
* విజయనగరం జిల్లా చీపురుపల్లిని 10 మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్ చేశారు.
* గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని 4మండలాలను తొలుత రాజమహేంద్రవరం జిల్లాలో చేర్చారు. తాజాగా ఈ నియోజకవర్గంలోని ద్వారకా తిరుమలను ఏలూరు జిల్లాలోకి తెచ్చారు. మిగిలిన 3మండలాలను రాజమహేంద్రవరం జిల్లాలోనే కొనసాగించారు.
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని.. తాజా మార్పుల్లో భాగంగా ఏలూరు జిల్లాలోకి తెచ్చారు.
* పెందుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాలను తొలుత అనకాపల్లి జిల్లాలో కలిపారు. తాజాగా ఇందులోని పెందుర్తిని విశాఖ జిల్లాలోకి తెచ్చారు. పరవాడ, సబ్బవరం మండలాలను మాత్రం అనకాపల్లిలో కొనసాగిస్తున్నారు.
* విజయవాడ రూరల్ మండలంలో మొత్తం 14 గ్రామాలు ఉండగా, 9 గ్రామాలు గన్నవరం నియోజకవర్గ పరిధిలో, 5 గ్రామాలు మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని 9 గ్రామాలు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనివి కావడం గమనార్హం.
*శ్రీబాలాజీ జిల్లా పేరును తిరుపతి జిల్లాగా మార్చారు. మన్యం జిల్లా పేరును పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చాలనే డిమాండును పరిగణనలోకి తీసుకున్నారు.
సత్తెనపల్లికి హోదా:పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో కొత్తగా సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేశారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని 5మండలాలను తొలుత గురజాల రెవెన్యూ డివిజన్లో చేర్చారు. తమకు గురజాల దూరమవుతుందనే అభ్యంతరాలొచ్చాయి. దీంతో బెల్లంకొండ మండలాన్ని గురజాల డివిజన్‌లోనే కొనసాగించి పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, అమరావతి మండలాలను నరసరావుపేట రెవెన్యూ డివిజన్లో చేర్చారు. దీనిపైనా ప్రజలు అభ్యంతరాలు తెలిపారు. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలతో ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయాలని కోరారు. ఇందుకనుగుణంగానే సత్తెనపల్లిని కొత్త రెవెన్యూ డివిజన్ చేశారు. వినుకొండ నియోజకవర్గంలో భాగమై నరసరావుపేట డివిజన్‌లో ఉన్న బొల్లాపల్లి మండలాన్ని తాజాగా గురజాల రెవెన్యూ డివిజన్‌లోకి మార్చారు.
అభ్యంతరాలు బేఖాతర్..