వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినప్పటికీ (నాలా) నిర్దేశిత ఫీజులను ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగ్గొట్టిన వారి నుంచి వసూళ్ల ప్రక్రియ మొదలైంది. డిసెంబరు 18 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ((Revenue Department)) జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జులైలో ఏపీ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పు) చట్టానికి సవరణ చేశారు. దీనికి ముందు మార్కెట్ విలువలో నాలా కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్న ఫీజును ఉమ్మడిగా 5%గా చేసిన చట్ట సవరణకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ఆదేశాలనిచ్చింది.
నిర్ణీత గడువులో ఫీజు చెల్లించని వారి నుంచి జరిమానా రూపంలో వంద శాతం వసూలు చేయాలని స్పష్టం చేసింది. తాజాగా సర్వే, సబ్‌డివిజన్ నెంబర్ల వారీగా వెబ్‌ల్యాండ్, జారీ చేసిన పట్టాదారు పుస్తకాల్లోని వివరాలను సేకరించి తగిన చర్యలు తీసుకునేలా రెవెన్యూశాఖ ప్రత్యేక నమూనాల(Revenue Department guidelines for fee collection)ను పంపింది. ఫీజులు చెల్లించని వారికి నోటీసులు ఇవ్వనుంది. కార్యాచరణలో భాగంగా వచ్చేనెల 31 వరకు గ్రామాల వారీగా జాబితాలు రూపొందిస్తారు. వీటిని నిశితంగా పరిశీలించి నవంబరు1 లోగా ఆమోదించాలి. ఈలోగానే అక్టోబరు20 నుంచి నవంబరు15 మధ్య ఫీజులు చెల్లించని వారికి నోటీసులిస్తారు. నవంబరు2 నుంచి డిసెంబరు15 మధ్య సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఏమైనా అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ వసూళ్ల ద్వారా సుమారు రూ.250 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.