ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

revenue:రాష్ట్రంలో రెవెన్యూ అగాధం! ... 900% దాటిన "రెవెన్యూ లోటు"

రాష్ట్రంలో రెవెన్యూ అగాధం ఏర్పడింది. రెవెన్యూ లోటు ఏకంగా 900 శాతం దాటేసింది. అదే సమయంలో సొంత ఆదాయానికి దాదాపు సమానంగా ప్రభుత్వం అప్పు చేసింది. బడ్జెట్‌ అంచనాలను మించి... రాష్ట్ర ప్రభుత్వం 9నెలల్లోనే 58 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంది.

రాష్ట్రంలో రెవెన్యూ అగాధం!
రాష్ట్రంలో రెవెన్యూ అగాధం!

By

Published : Feb 14, 2022, 3:59 AM IST

రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడి కంటే... రెవెన్యూ ఖర్చులు చాలా వరకు పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో రెవెన్యూ లోటు కొండలా పేరుకుపోతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 త్రైమాసికాలకు సంబంధించిన రాష్ట్ర లెక్కలు ఖరారయ్యాయి. చట్టసభలకు బడ్జెట్ సమర్పించిననాడు రెవెన్యూ లోటు 5వేల కోట్ల 6 లక్షలు మాత్రమే. ఆ మేరకు రెవెన్యూ ఉంటుందని లెక్కించారు. ఆమేరకు రెవెన్యూ రాబడిని, ఖర్చులను సమన్వయం చేసుకునేలా బడ్జెట్ ప్రతిపాదించారు. డిసెంబర్ నెలాఖరుతో ముగిసిన 9నెలల కాలంలో రెవెన్యూ లోటు 45వేల 907.65 కోట్లుగా లెక్క తేలింది.

అంచనాలకన్నా అది 918.14శాతం మేర పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రెవెన్యూ లోటు... నాటి అంచనాలతో పోలిస్తే 270శాతానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో క్రమేణా రెవెన్యూ రాబడులు మెరుగుపడుతున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయాలకు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడిగా లెక్కిస్తుంటారు. రెవెన్యూ రాబడి దాదాపు లక్ష కోట్లకు చేరింది. ఈ 9నెలల్లో కేంద్రం నుంచి గ్రాంటుగా వచ్చిన 25వేల 246.19 కోట్లతో కలిపి మొత్తం రెవెన్యూ రాబడి 97వేల 887.21 కోట్లకు చేరింది.

రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఒక్కటే కాదు... అప్పులు కూడా అంచనాలను మించిపోతున్నాయి. తొలి 9 నెలల్లో ప్రభుత్వం ఏకంగా 58వేల 111.85 కోట్లు రుణంగా సమీకరించింది. బడ్జెట్ అంచనాల్లో 37వేల 29.79 కోట్ల రుణంతోనే ఈ ఆర్థిక సంవత్సరాన్ని గట్టెక్కవచ్చని భావించింది. అలాంటిది ఇప్పటికే అప్పు అంచనాలకు మించి 156 శాతానికి చేరింది. ప్రభుత్వం చేసిన అప్పులు... రాష్ట్ర సొంత ఆదాయానికి దాదాపు సమానంగా ఉన్నాయి. జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం, భూమిశిస్తు, అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఇతర పన్నులు కలిపి... ఈ 9నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పన్నుల ఆదాయం 69వేల 943.71 కోట్లుగా ఉంది. అదే సమయంలో వివిధ రూపాల్లో సమీకరించిన అప్పు 58వేల కోట్లకు పైనే ఉంది.

ఇదీ చదవండి:

fire accident: విశాఖ జిల్లా వెంకటాపురంలో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details